అక్షరటుడే, ఎల్లారెడ్డి: రాష్ట్రంలో 22 నెలల విరామం తర్వాత కొత్త పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమవారం కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Gram Panchayat | మూడు విడతల్లో ముగిసిన సమరం..
జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) గెలుపొందిన 532 మంది సర్పంచులు, 4,656 మంది వార్డు సభ్యులు ఆయా గ్రామ పంచాయతీల్లో కొలువుదీరనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా పాలకవర్గాల ప్రమాణస్వీకారం మహోత్సవానికి గ్రామపంచాయతీలు (Gram Panchayats) ముస్తాబయ్యాయి. రెండేళ్ల అనంతరం గ్రామాల్లో మళ్లీ సర్పంచ్ వ్యవస్థ రానుండడంతో గ్రామపంచాయతీలను అందంగా ముస్తాబు చేయడంతో పాటు.. కొత్త ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు.
Gram Panchayat | కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) ఇటీవల మూడు విడతల్లో జరిగిన 532 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. అందులో 80 వరకు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగతా 452 స్థానిక సంస్థలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. అందులో 258 మంది పురుషులు సర్పంచులు కాగా.. 270 మంది నారీమణులు గ్రామాలను ఏలనున్నారు.
Gram Panchayat | 22ఏళ్ల నుంచి.. 70ఏళ్ల వృద్ధుల వరకు..
22 ఏళ్ల యువత నుంచి 70 ఏళ్ల వృద్ధులు సైతం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా (Sarpanches) ఎన్నికయ్యారు. 19 నుంచి 35ఏళ్లలోపు యువత 175 మంది పల్లె పాలనలో యువగళం వినిపించనున్నారు. 36 నుంచి 55 ఏళ్ల వయసు గలవారు 257 మంది గెలుపొందారు. 56 నుంచి 70 ఏళ్ల వరకు 37 మంది సర్పంచులుగా ఎంపికయ్యారు. 70 ఏళ్లు పైబడిన వారు సైతం నలుగురు అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందడం విశేషం.
Gram Panchayat | మహిళలు అధికంగా..
21 నుంచి 25ఏళ్లలోపు వయసు ఉన్న మహిళలు సర్పంచ్‌గా విజయం సాధించారు. రెండో తరగతి నుంచి పదో తరగతిలోపు చదివిన వారు 353 మంది, పది నుంచి డిగ్రీ వరకు 82 మంది, పీజీ వరకు చదివిన యువత 15మంది ఉండగా, 82 మంది నిరక్షరాస్యులు పదవీబాధ్యతలు చేపట్టనున్నారు. కాగా.. లక్ష్మీ అనే పేరు గల మహిళలు 20 మంది ఉన్నారు. సాయి అని పేరున్న వారు 13 మంది, శ్రీనివాస్ అనే పేరు ఉన్నవారు ఆరుగురు, నర్సింలు, నర్సయ్య అనేవారు ఆరుగురు, పద్మ పేరుతో ముగ్గురు అభ్యర్థులు గెలుపొందారు.