అక్షరటుడే, హైదరాబాద్: Panchayat Elections | తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ తాజాగా (ఆదివారం, ఉదయం 7 గంటలు) ప్రారంభమైంది. పోలింగ్ నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం State Election Commission అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం రెండో విడతలో 4,332 పంచాయతీల్లోని సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
కాగా, 415 సర్పంచి Sarpanch స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. రిజర్వేషన్లు, ఇతర సమస్యల వల్ల ఆరు చోట్ల ఎన్నికలు జరగడం లేదు. ఈ క్రమంలో ఆదివారం 3,911 సర్పంచి స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ స్థానాలన్నింటిలో కలిపి 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
Panchayat Elections | వార్డుల పరిస్థితి..
ఇక వార్డు విషయానికి వస్తే.. రెండో విడతలో 38,342 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది, అయితే, 8,304 స్థానాలు ఏకగీవ్రం కావడం గమనార్హం. మరో 107 వార్డు స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 29,903 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ మొత్తం వార్డు స్థానాల్లో 78,158 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
Panchayat Elections | పోలింగ్ కేంద్రాలు..
రెండో విడతలో మొత్తం 57,22,565 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఇక పోలింగ్ కేంద్రాల విషయానికి వస్తే.. 193 మండలాల్లో 38,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.