అక్షరటుడే, ఇందూరు: Panchayat elections | తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేడు ఉదయం 7 గంటలకు మొదలైంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లోని 12 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆలూరు ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల్లో పోలింగ్ ప్రారంభమైంది.
నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 165 గ్రామపంచాయతీలకు గాను.. ఇప్పటికే 19 గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా 146 సర్పంచి స్థానాలకు 562 మంది పోటీలో ఉన్నారు. 1,620 వార్డు స్థానాలకు.. 490 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 1,130 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3,382 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల కోసం 1,490 పోలింగ్ స్టేషనులను ఏర్పాటు చేశారు.
ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ చేపడతారు.

అంకాపూర్‌లో బారులు తీరిన ఓటర్లు
Panchayat elections | ఆర్మూర్ డివిజన్ ప్రతిష్ఠాత్మకం
నిజామాబాద్ జిల్లాలో చివరి విడత ఎన్నికలు ఆర్మూర్ డివిజన్లో జరుగుతున్నాయి. ఇక్కడ కీలక నేతలు ప్రాతినిధ్యం వహించడంతో త్రిముఖ పోరు ఉంది. బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, ఆమె తనయుడు మల్లికార్జున్, కాంగ్రెస్ నుంచి సునీల్ రెడ్డి ఉన్నారు. తమ మద్దతుదారులు గెలుస్తారని ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆర్మూర్‌లో కాంగ్రెస్ నుంచి వినయ్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి ఉన్నారు. దీంతో త్రిముఖ పోరు తప్పదని ప్రజలు భావిస్తున్నారు.
Panchayat elections | కామారెడ్డి జిల్లాలో ..
kamareddy జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, బిచ్కుంద, డొంగ్లీ, మద్నూర్, జుక్కల్, పెద్దకొడప్గల్ మండలాల్లోని 168 గ్రామ పంచాయతీలు, 1,482 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా, 26 సర్పంచి స్థానాలు, 449 ఏక్రగీవం అయ్యాయి. ఇక 13 వార్డులకు నామినేషన్లు రాలేదు. దీంతో 142 సర్పంచి, 1020 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ విడతలో మొత్తం 1,482 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 812 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుతో పాటు అదనంగా 37 రూట్ మొబైల్ పార్టీలు, 8 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను మోహరించారు.