అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. తొలిదశలో భాగంగా రెండో రోజు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అయితే పలువురు రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం ధర్మాసనం విచారణ చేపట్టింది.
పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) రిజర్వేషన్ GO 46 పై హైకోర్టులో విచారణ సాగింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని ధర్మాసనం పేర్కొంది. సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలను రద్దు చేయాలని కోరుకుంటున్నారా అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండొద్దని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేస్తూ గతంలో ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని విచారణ సందర్భంగా పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించమని తామే చెప్పాం కదా అని కోర్టు వెల్లడించింది.
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో 46 జారీ చేసింది. దీనిపై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ బీసీ కులసంఘాలు న్యాయస్థానంలో పిటిషన్ వేశాయి. బీసీలలో ఏబీసీడీ వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అలాగే సంగారెడ్డి జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉండగా.. 117 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారని పలువురు కోర్టును ఆశ్రయించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో వెల్దండ తిమ్మనోనిపల్లి (Thimmanonipalli) రిజర్వేషన్లపై పిటిషన్ దాఖలైంది. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానంలో స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి.