అక్షరటుడే, కామారెడ్డి: Machareddy Mandal | ఓ పంచాయతీ భవనం ఇరుగ్రామాల పాలకవర్గాల ప్రమాణస్వీకారం నిలిచిపోయేలా చేసింది. పంచాయతీ భవనం మాది అంటే మాది అనే వివాదం తారాస్థాయికి చేరడంతో ఆ గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరించాల్సిన పరిస్థితి నెలకొంది.
Machareddy Mandal | మాచారెడ్డి మండలంలో..
ఈ ఘటన మాచారెడ్డి మండలం (Machareddy Mandal) సోమార్ పేట, సోమార్ పేట తండాలో చోటుచేసుకుంది. ఇరు గ్రామాల కథనం ప్రకారం.. మాచారెడ్డి మండలంలో సోమార్ పేట గ్రామ పంచాయతీ (Somarpet Gram Panchayat) పరిధిలో సోమార్ పేట తండా, రోడ్ బండ తండా ఉండేవి. దాదాపు రెండేళ్ల క్రితం సోమార్ పేట తండా ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. ప్రస్తుతం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రెండు గ్రామ పంచాయతీలకు సర్పంచులు ఎన్నికయ్యారు.
Machareddy Mandal | రెండుగ్రామాల్లో గప్చుప్..
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల ప్రమాణస్వీకారం జరుగుతుండగా సోమార్ పేట, సోమార్ పేట తండాలో మాత్రం జరగలేదు. అయితే సోమార్ పేట గ్రామంలో ఒకటి, తండా పరిధిలో ఒక పంచాయతీ భవనాలు ఉన్నాయి. తండా పరిధిలో ఉన్న పంచాయతీ భవనంలో (panchayat building) ఇరు సర్పంచులు ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధమయ్యారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. పంచాయతీ భవనంలో తామే ప్రమాణస్వీకారం చేస్తామని ఇరువర్గాలు సిద్ధమయ్యాయి.
Machareddy Mandal | జీపీ భవనం మాదంటే మాది అని..
పంచాయతీ భవనం మాది అంటే మాది అనే గొడవ కావడంతో తండా వాసులు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలతో ప్రమాణస్వీకారం చేయించడానికి ఒప్పించే ప్రయత్నం చేయగా ఇరువురు ఒప్పుకోలేదు. దాంతో ఇరువురుని మాచారెడ్డి వచ్చి ప్రమాణస్వీకారం చేయాలని సూచించగా సోమార్ పేట పాలకవర్గం తమకు పంచాయతీ భవనం ఉండగా మాచారెడ్డి ఎందుకు వస్తామని వెళ్ళలేదు. దాంతో రెండు గ్రామాల పాలక వర్గాలు ప్రమాణస్వీకారం నిలిచిపోయింది. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.
Machareddy Mandal | మమ్మల్ని అణగదొక్కాలని చూస్తున్నారు
తమకు గ్రామ పంచాయతీ ఏర్పడితే అగ్రవర్ణాలకు మింగుడు పడటంలేదని సోమార్ పేట తండా వాసులు పేర్కొంటున్నారు. తండా పంచాయతీగా ఏర్పడినప్పుడు భవనాన్ని మాకే కేటాయించారన్నారు. అలా కాకుండా పాత గ్రామ పంచాయతీ భవనం ఇవ్వాలని అడిగినా ఇవ్వడం లేదని, అన్ని ప్రభుత్వ భవనాలు వారికే ఉండాలని చూస్తున్నారని ఆరోపించారు.
Machareddy Mandal | పంచాయతీ వేరు చేసిన విషయం తెలియదు..
సోమార్ పేట నుంచి తండాను ప్రత్యేక పంచాయతీగా చేసిన విషయం తమకు తెలియదని సోమార్ పేట వాసులు పేర్కొన్నారు. గ్రామంలో ఉన్న ముఖ్యమైన ఆలయాలు, భవనాలు సర్వే నంబర్ 22, 29లో ఉన్నాయి. వీటిని రెండు గ్రామాలకు చెందేలా ఉంచారు. అయితే తండా పంచాయతీ అవుతున్న విషయం తమకు తెలియదని, పంచాయతీ ఏర్పాటుపై అభ్యంతరాల కోసం గెజిట్ ఇచ్చిన విషయం కూడా తమకు తెలియదన్నారు. సర్వే నంబరు కేటాయింపుల విషయమై తాము కోర్టుకు వెళ్లామని తెలిపారు. తండావాసుల కోసం భవిష్యత్తులో భవనాల ఏర్పాటుకు 2 గుంటలు స్థలాన్ని కొనుగోలు చేసి ఉంచామని అందులో భవనం నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు.