అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PCC Chief Mahesh Goud | మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై ఇటీవల మరో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. దళిత మంత్రిని పట్టుకొని దున్నపోతు అని వ్యాఖ్యానించారని దళిత సంఘాలు పొన్నం తీరుపై మండిపడుతున్నాయి.
ఇద్దరు మంత్రుల మధ్య పంచాయితీతో పార్టీకి నష్టం జరుగుతుందని భావించినా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Goud) రంగంలోకి దిగారు. స్థానిక ఎన్నికల వేళ పొన్నం వ్యాఖ్యలతో పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీంతో మంత్రులు పొన్నం, అడ్లూరితో ఆయన ఫోన్లో మాట్లాడారు. సంయమనం పాటించాలని ఇద్దరికి సూచించారు. ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సైతం పీసీసీ అధ్యక్షుడితో చర్చించినట్లు సమాచారం. కాగా.. పొన్నం వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు సైతం తప్పు పట్టారు. పార్టీకి ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు.
ఈ వ్యవహారంపై ఇద్దరు మంత్రులతో బుధవారం పీసీసీ భేటీ కానుంది. ఈ మేరకు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని పొన్నం, అడ్లూరికి మహేశ్‌గౌడ్ సూచించారు. ఇరువురితో మాట్లాడి ఇష్యూ సెటిల్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబును ఆయన కోరారు.
PCC Chief Mahesh Goud | అడ్లూరిని అనలేదు
తాను దున్నపోతు అని మంత్రి అడ్లూరిని (Minister Adluri Laxman Kumar) ఉద్దేశించి అనలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు. తాను దున్నపోతు అన్నప్పుడు.. మంత్రి లక్ష్మణ్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప ఇంకేం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై అడ్లూరితో మాట్లాడేందుకు ప్రయత్నించానని, కానీ ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో మాట్లాడినట్లు చెప్పారు. కాగా ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణుగుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.