అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ నగర శారీరక్ ప్రముక్ బాలాజీ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్, ఆర్టీసీ కాలనీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మహాలక్ష్మి మందిరంలో ఆదివారం విజయదశమి ఉత్సవం (Vijayadashami festival) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ (RSS) 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాల్లో పనిచేస్తోందని తెలిపారు. హిందువుల్లో (Hindus) ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వం అనేది జీవన విధానం, విశ్వశాంతికి ఆధారమన్నారు. ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయం చేసే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు.
దేశ అభివృద్ధి కోసం హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సమరసత, కుటుంబ జీవన విలువలు, ఆధారిత జీవనం, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు పాటించాలన్నారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజుల్లో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతుందని తెలిపారు. అనంతరం విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ బాలరాజు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ దేశ అఖండతకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు ఎన్నో చర్యలు చేపడుతోందని వివరించారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ను ప్రజలకు చేరువ చేశాయని ఆయన చెప్పారు.