అక్షరటుడే, వెబ్డెస్క్ : Smriti Mandhana | భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లికి సంబంధించిన ఫొటోలను తొలగించింది. ఆమె వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం విదితమే. వివాహ వేడుకలు జరుగుతుండగా స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురికావడంతో కార్యక్రమాన్ని నిలిపివేశారు.
ఆ తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (Instagram Account) నుంచి వివాహ వేడుకల ఫొటోలు కూడా మాయమయ్యాయి. దీంతో ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. పలాష్ ముచ్చల్‌తో ఎంగేజ్‌మెంట్‌ను ధ్రువీకరిస్తూ ఇటీవల స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. సహచర క్రికెటర్లతో కలిసి బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ సందర్భంగా తన వేలికి నిశ్చితార్థపు ఉంగరం ఉందంటూ చూపించింది.
Smriti Mandhana | ఫొటోలు డిలీట్..
అయితే ఈ వీడియో ఇప్పుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కనిపించడం లేదు. ఇదే వీడియోను స్మృతి స్నేహితురాళ్లు జెమీమా, శ్రేయాంక కూడా తమ సామాజిక మాధ్యమ ఖాతాల నుంచి తొలగించారు. మరి ఈ వీడియోను స్మృతి మంధాన (Smriti Mandhana) తొలగించిందా? లేక హైడ్ చేసిందా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పలాశ్ ముచ్చల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రపోజల్ వీడియో మాత్రం అలాగే ఉంది. వన్డే క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన స్టేడియంలోనే స్మృతి వేలికి ఉంగరం తొడుగుతూ పలాశ్ వివాహ ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో మాత్రం అలాగే ఉంది. తండ్రి అనారోగ్యానికి గురైన ప్రస్తుత పరిస్థితుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. అందుకే వాయిదా వేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు మంధాన మేనేజర్ ప్రకటించారు. అటు పలాశ్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
ఇక స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ (Palash Muchchal) ప్రేమ కథ 2019లో ప్రారంభం కాగా, అప్పటి నుంచి వారు నిజమైన ప్రేమలోనే మునిగితేలారు. ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారని అనుకునేలోపు వివాహానికి బ్రేక్ పడింది. వీరి పెళ్లి మహారాష్ట్రలోని సాంగ్లీలో ఏర్పాటు చేయగా, ఆమె తండ్రి అనారోగ్యం వలన అర్ధాంతరంగా ఆగిపోయింది. స్మృతి తండ్రి త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధిస్తున్నారు. మరోవైపు పలాష్ ముచ్చల్ సోదరి పాలక్ ముచ్చల్ తాజాగా స్పందించింది. ఇరు కుటుంబాల గోప్యతను కాపాడాలని కోరింది.
