అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistan Cricket | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్‌లో (Asia Cup) భాగంగా బుధవారం యూఏఈతో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించింది. ఇండియా, పాక్ మ్యాచ్ (India-Pakistan match) సందర్భంగా తలెత్తిన షేక్ హ్యాండ్ వివాదం నేపథ్యంలో మ్యాచ్ రిఫరీని తొలగించక పోవడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో (Dubai International Cricket Stadium) గ్రూప్ A మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు సూపర్-4కు చేరుకుంటారు. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, యూఏఈ క్రికెటర్లు స్టేడియానికి చేరుకున్నారు. కానీ పాక్ క్రికెటర్లు మాత్రం రాలేదు.
Pakistan Cricket | హోటల్లోనే క్రికెటర్లు..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆసియా కప్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ను బహిష్కరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. బుధవారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా, సాయంత్రం 6.30 గంటలైనా పాకిస్తాన్ క్రికెటర్లు హోటల్ నుంచి బయటకు రాలేదు. ఆటగాళ్లు ఎవరు బయటకు రావొద్దని, హోటల్ లోనే ఉండాలని పీసీబీ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సమయం దగ్గర పడినా ఆటగాళ్లు హోటల్ రూంల నుంచి బయటకు రాలేదు.
Pakistan Cricket | అందుకే బాయ్ కాట్..
ఇటీవల భారతదేశంతో జరిగిన హ్యాండ్ షేక్ వివాదం (handshake controversy) తర్వాత ఆసియా కప్‌లో యూఏఈతో జరిగే చివరి గ్రూప్ ఆటను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. భారతదేశంతో జరిగిన మ్యాచ్‌లో హ్యాండ్ షేక్ వివాదానికి ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ కారణమని, ఆయనను తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది.
అయితే, ఆ విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. యూఏఈతో జరుగనున్న మ్యాచ్‌కు కూడా ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. జాతీయ జట్టును హోటల్లోనే ఉంచాలని, యూఏఈతో జరిగే మ్యాచ్ కోసం వేదికకు వెళ్లవద్దని పీసీబీ ఆదేశించింది. భారత్‌తో పాటు ఐసీసీ తీరుకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
