అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistanis memes viral : సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై అంతర్జాతీయంగానే కాకుండా అంతర్గతంగా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాయాదిని విమర్శిస్తూ, వెక్కిరిస్తూ సొంత దేశస్తులే నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. సింధు జలాలు ఆపేయాలన్న భారత నిర్ణయాన్ని సైతం ఇందులో కలుపుతూ పాక్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
‘నీళ్లు ఆపి మమ్మల్ని చంపాలని అనుకుంటున్నారా? ఇప్పటికే పాక్ ప్రభుత్వం మమ్మల్ని చంపుతోందని’ మీమ్స్ తయారు చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇంటా, బయటా విమర్శలతో షెహబజ్ ప్రభుత్వం సతమతమవుతోంది.
Pakistanis memes viral : ఆకట్టుకుంటున్న మీమ్స్
‘మినీ స్విట్జర్లాండ్’ గా పిలిచే పహల్గావ్ దాడిలో 26 మంది పర్యాటకుల ఊచకోత తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. రెండు దేశాలు కూడా వీసా సేవలను నిలిపివేసి, సందర్శకులను బహిష్కరించాయి. “పాకిస్తాన్ కొనసాగించిన సీమాంతర ఉగ్రవాదం” అని పేర్కొంటూ భారతదేశం సింధు జల ఒప్పందాన్ని కూడా నిలిపి వేసింది.
పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలను ఎదుర్కోవడానికి షహబజ్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ పాక్ ప్రభుత్వంపై బయటి నుంచి, అలాగే అంతర్గతంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తానీయులు తమ సొంత ప్రభుత్వాన్ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ భయంకరమైన పహల్గావ్ దాడికి జవాబు చెప్పాలని కోరుతున్నారు. ఇందులో ప్రధానంగా పాకిస్తాన్‌పై భారత్ తీసుకున్న చర్యలపైనే ఎక్కువగా ఉన్నాయి.
భారత్ గనుక యుద్ధం ప్రారంభిస్తే తొమ్మిది గంటలకు ముందే దాన్ని ముగించాలని, ఎందుకంటే ఆ తర్వాత గ్యాస్ సరఫరా ఆగిపోతుందని.. అక్కడి పరిస్థితిని ఎత్తి చూపారు. మరో మీమ్‌లో.. “వారికి (ఇండియాకు) మరిన్ని కుంటి జోకులు ఇవ్వకండి. ఆటా, పానీ, భీక్ (ఆహారం, నీరు, భిక్ష), ఇప్పుడు గ్యాస్ లేకపోతే కష్టమే. వారు(భారత్) ఒక పేద దేశంతో పోరాడుతున్నారని తెలుసుకోవాలి” అంటూ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని ఉదాహరించారు.
పాకిస్తాన్ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తూ ఒక ప్రముఖ మీమ్‌ను కూడా తెగ వైరల్ చేస్తున్నారు. పేపర్బోర్డుతో తయారు చేసిన ఫైటర్ జెట్ cardboard fighter jet ను మోటార్ సైకిల్ సాయంతో నడుపుతున్న మీమ్ కడుపుబ్బా నవ్విస్తోంది. భారతదేశం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పటికే తీవ్ర నీటి కొరత ఉందని మరో మీమ్ రూపొందించారు.
“నీటిని ఆపాలనుకుంటున్నారా? ఇప్పటికే నీటి సరఫరా లేదు. మమ్మల్ని చంపాలనుకుంటున్నారా? మా ప్రభుత్వం ఇప్పటికే మమ్మల్ని చంపుతోంది. మీరు లాహోర్‌ను తీసుకుంటారా? మీరు అరగంటలోపు దాన్ని తిరిగి వదిలేస్తారు. ” అని చేసిన మీమ్ వైరల్ అవుతోంది.
