HomeUncategorizedIndia - Pak | భారత్ దెబ్బకు విలవిల్లాడుతున్న పాక్‌

India – Pak | భారత్ దెబ్బకు విలవిల్లాడుతున్న పాక్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: India – Pak | జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir)లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 26 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనతో భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఈ దాడి వెనుక పాకిస్థాన్( Pakistan ) హస్తం ఉందనడానికి బలమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో పాక్‌కు గట్టి బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం(Central government) కఠిన చర్యలు తీసుకుంటోంది. ఉగ్రదాడి అనంతరం సర్జికల్‌ స్ట్రైక్స్‌ను ఊహించిన పాక్‌ అంచనాలకు అందకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మన దేశం పాక్‌తో దౌత్య సంబంధాలు తగ్గించుకోవడం, వీసాల రద్దు, సింధు జలాల ఒప్పందం రద్దు, పాకిస్థానీయులు వారం రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించడం వంటి చర్యలతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం(Economic Crisis)తో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌‌ను భారత్‌(Bharath) తీసుకుంటున్న నిర్ణయాలు మరింత దెబ్బతీస్తున్నాయి. పాకిస్థాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు దేనికైనా సిద్ధమేనంటూ ఆ దేశ ప్రధాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దివాలా అంచున ఉన్న పాక్‌.. అప్పులపై ఆధారపడి నడుస్తోంది. ఒకవేళ పాకిస్థాన్.. భారత్‌తో తలపడాలన్నా దీనిని భరించే స్థితిలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ లేకపోవడం గమనార్హం.

India – Pak | స్టాక్‌ మార్కెట్‌ పతనం..

ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌(Stock market) కుదేలవుతోంది. గురువారం ఆ దేశ స్టాక్ ఎక్స్ఛేంజ్ రెండు వేల పాయింట్లకు పైగా నష్టపోయింది. అంతకుముందు రోజు కూడా 500 పాయింట్లకుపైగా పడిపోయింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(Financial year)లో పాక్‌ వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్థ 2.6 శాతానికి తగ్గించింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) సైతం పాకిస్థాన్ జీడీపీ వృద్ధి అంచనాను 3 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశ ఇన్వెస్టర్లు(Investers) ఆందోళనతో స్టాక్‌ మార్కెట్‌లో అమ్మకాలకు పాల్పడుతున్నారు.

India – Pak | సింధు జలాల ఒప్పందం..

సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ రద్దు చేయడం పాకిస్థాన్‌ను అన్ని రకాలుగా దెబ్బతీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సింధు జలాల ద్వారా పాకిస్థాన్‌లో వ్యవసాయ(Agriculture) రంగం తీవ్రంగా నష్టపోనుంది. పాకిస్థాన్ జీడీపీ(GDP)కి వ్యవసాయ రంగం నుంచే 22.7 శాతం తోడ్పాటు అందుతోంది. తాగునీటికి సైతం ఇబ్బందులు ఏర్పడనున్నాయి. ఓవైపు సింధు జలాలను ఆపేయడంతో జరిగిన నష్టం, మరోవైపు ఒక్కసారిగా జీలం డ్యాం గేట్లను ఎత్తేయడం వల్ల వచ్చిన వరదలతో పాక్‌ మరింత అతలాకుతలం అవుతోంది.