terrorist attack | సరిహద్దులో యుద్ధ మేఘాలు..భారత్​పై ఎదురుదాడికి పాకిస్తాన్​ సన్నద్ధం!
terrorist attack | సరిహద్దులో యుద్ధ మేఘాలు..భారత్​పై ఎదురుదాడికి పాకిస్తాన్​ సన్నద్ధం!

అక్షరటుడే, న్యూఢిల్లీ: terrorist attack : జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గావ్​లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు హతమవడంతో, భారత్ కఠిన చర్యలు తీసుకుంది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ సైతం ప్రతిచర్యలు చేపడుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందంపైనా పాకిస్తాన్ పున:పరిశీలన చేస్తోంది. ఇప్పటికే నూర్​ ఖాన్​ ఆర్మీ బేస్​లో పాకిస్తాన్​ యుద్ధ విమానాలు మోహరించాయి. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

పహల్గావ్​ ఉగ్రదాడి తర్వాత భారత్‌ తీసుకున్న కఠిన నిర్ణయాల నేపథ్యంలో పాకిస్తాన్​ తీవ్రంగా స్పందించింది. ఇస్లామాబాద్‌లో జాతీయ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించిన ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. వాఘా సరిహద్దును మూసివేయాలని, సిక్కు యాత్రికులను మినహాయించి భారతీయులకు సార్క్‌ వీసాలను నిలిపివేయాలని నిర్ణయించారు.

ఇస్లామాబాద్‌లో భారత దౌత్యవేత్తల సంఖ్యను 30కి తగ్గించాలని నిర్ణయించింది. భారత్‌ హైకమిషన్‌లోని మిలటరీ అడ్వైజర్లను ఈ నెల (ఏప్రిల్‌) 30లోగా వెళ్లిపోవాలని పాకిస్తాన్​ ఆదేశించింది. భారత్‌తో అ‌న్ని రకాల వాణిజ్యాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

భారత్‌ విమానాలు పాక్‌ గగనతలంలోకి రాకుండా నిషేధం విధించింది. సింధూ జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు ఉద్దేశించిన నీటిని మళ్లించడం కానీ, నిలిపివేతకు చేసే ఏ ప్రయత్నమైనా యాక్ట్‌ ఆఫ్‌ వార్‌గా పరిగణిస్తామని పాక్‌ స్పష్టం చేసింది.

పాక్‌ సార్వభౌమత్వానికి, భ‌ద్రతకు ముప్పు వాటిల్లితే గట్టిగా స్పందిస్తామని NSC సమావేశం తర్వాత పాకిస్తాన్​ వెల్లడించింది. షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పాక్‌ సైన్యాధికారులు, మంత్రులు, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.