MP Asaduddin Owaisi
MP Asaduddin Owaisi | పాకిస్తాన్ విఫ‌ల దేశం.. ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ :MP Asaduddin Owaisi | ఉగ్ర‌వాదాన్ని ఎగ‌దోస్తున్న‌ పాకిస్తాన్ విఫ‌ల దేశ‌మ‌ని ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ అభివ‌ర్ణించారు.

ఆప‌రేష‌న్ సిందూర్‌(Operation Sindoor)తో పాటు పాకిస్తాన్ ఉగ్ర వైఖ‌రిని ప్ర‌పంచ‌దేశాల‌కు వివ‌రించేందుకు కేంద్రం నియ‌మించిన‌ అఖిల‌ప‌క్ష ప్ర‌తినిధి బృందంలో స‌భ్యుడైన ఆయ‌న బ‌హ్రెయిన్‌(Bahrain)లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆదివారం బహ్రెయిన్‌లో జరిగిన ఓ సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ.. పాక్‌(Pakistan)పై విమర్శ‌లు గుప్పించారు. పొరుగు దేశం నుంచి వచ్చే ఏదైనా దురాక్రమణ నుంచి ఇండియా తనను తాను రక్షించుకునే సామర్థ్యం ఉంద‌ని పునరుద్ఘాటించారు. “ప్రభుత్వం, మీడియా, మన వైమానిక రక్షణ వ్యవస్థ, మన సాంకేతికత, యుద్ధ సామర్థ్యాలు అన్నీ క‌లిపి.. పాకిస్తాన్ వంటి విఫలమైన దేశం ప్రారంభించిన ప్రతి చ‌ర్య‌ను విజయవంతంగా అడ్డుకున్నాయని” అని వివ‌రించారు.

MP Asaduddin Owaisi | కేంద్రంపై ప్ర‌శంస‌లు..

దేశాన్ని ర‌క్షించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం(Central Government) బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించింద‌ని ఒవైసీ ప్ర‌శంస‌లు కురిపించారు. “ప్రతి భారతీయుడి ప్రాణాలను రక్షించడానికి మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. మ‌రోసారి మీరు (పాకిస్తాన్) ఉగ్ర చర్యల‌కు పాల్పడితే, ఫ‌లితం మీ ఊహ‌కు కూడా అంద‌ద‌ని మా ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన హెచ్చరిక‌లు పంపింద‌ని” చెప్పారు. భార‌త ర‌క్ష‌ణ బ‌లాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్ద‌ని శ‌త్రుదేశానికి సూచించారు. ఇండియా బాధ్యతాయుతంగా వ్యవహరించి సంయమనం పాటించినప్పటికీ పొరుగు దేశం రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింద‌న్నారు. పాకిస్తాన్ చర్యలను ఖండించాలని, ఆ దేశాన్ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) జాబితాలోకి తీసుకురావడం ద్వారా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని అరికట్టడానికి సహాయం చేయాలని ఒవైసీ బహ్రెయిన్ ప్రభుత్వాన్ని కోరారు.

“మనం ఏ రాజకీయ పార్టీల‌కు చెందినవారైనా, మన దేశంలో ఏకాభిప్రాయం ఉంది. మాకు రాజకీయ విభేదాలు ఉన్నాయి. కానీ దేశ సమగ్రత విషయానికి వస్తే మ‌త్రం మ‌న‌మంతా ఒక్క‌టే. మన పొరుగు దేశం అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్‌ను FATF గ్రే లిస్ట్‌లోకి తిరిగి తీసుకురావడంలో బహ్రెయిన్ ప్రభుత్వం (Bahrain Government) మాకు సహాయం చేస్తుందని నేను న‌మ్ముతున్నాను. ఎందుకంటే ఈ డబ్బును ఆ దేశం ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడానికి ఉపయోస్తోంది” అని ఒవైసీ విమ‌ర్శించారు.