అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pakistan Independence Day : పాకిస్థాన్ (Pakistan) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ఆర్థిక రాజధాని కరాచీలో చోటుచేసుకున్న నిర్లక్ష్య ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిలించాయి.
వేడుకల పేరుతో గాల్లోకి జరిపిన కాల్పుల కారణంగా ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. స్వాతంత్య్రదినోత్సవాన్ని (Pakistan Independence Day) పురస్కరించుకుని ఆగస్టు 14 అర్ధరాత్రి తరువాత కరాచీ(karachi) నగరం తుపాకీ మోతలు, బాణసంచా శబ్దాలతో దద్దరిల్లింది.
అజీజాబాద్ బ్లాక్-8 ప్రాంతంలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలికపైకి తూటా దూసుకెళ్లి తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది.
Pakistan Independence Day : గాల్లోకి కాల్పులు..
ఇక కోరంగి ప్రాంతంలో స్టీఫెన్ Stephen అనే యువకుడు తూటా గాయంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే విధంగా నగరంలోని మరొక ప్రాంతంలో ఓ వృద్ధుడు కూడా ఇదే తరహా కాల్పుల్లో మరణించాడు.
ఈ నిర్లక్ష్య కాల్పుల ఘటనలు లియాఖతాబాద్ Liaquatabad, కోరంగి Korangi, లయారీ Lyari, నార్త్ నాజిమాబాద్ North Nazimabad తదితర ప్రాంతాల్లో విస్తరించాయి. రెస్క్యూ సిబ్బంది ప్రకారం.. మొత్తం 64 మందికి బుల్లెట్ గాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం చేర్పించారు.
వేడుకల పేరుతో గాల్లోకి జరిపే కాల్పులు ప్రమాదకరమని, ఇది అత్యంత బాధ్యతారాహిత్య చర్యగా అధికారులు ఖండించారు. ప్రజలు సురక్షితంగా, నిబంధనలకు లోబడి వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించి 20 మంది అనుమానితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు Police ఈ ఘటనలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో జరిగిన ఈ ప్రమాదం ప్రతి ఒక్కరిని కలిచి వేస్తోంది.
