అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistan Hockey Team Humiliation | అంతర్జాతీయ క్రీడా వేదికపై పాకిస్థాన్ జాతీయ క్రీడ హాకీకి ఘోర అవమానం ఎదురైంది. నిధుల కొరతతో పాటు సమాఖ్య నిర్వాకం కారణంగా ఆస్ట్రేలియా (Australia)లో పర్యటిస్తున్న పాకిస్థాన్ హాకీ జట్టు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది.
బస కోసం ముందుగా బుక్ చేసిన హోటల్ బిల్లు చెల్లించకపోవడంతో యాజమాన్యం బుకింగ్‌ను రద్దు చేయడం వల్ల ఆటగాళ్లు గంటల తరబడి రోడ్డుపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. FIH Pro League టోర్నమెంట్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా (Canberra)కు చేరుకుంది. అయితే జట్టు బస చేయాల్సిన నాలుగు నక్షత్రాల హోటల్‌కు చెల్లింపులు జరగకపోవడంతో హోటల్ యాజమాన్యం వారి రిజర్వేషన్‌ను రద్దు చేసింది. ఈ విషయాన్ని తెలియని ఆటగాళ్లు, అధికారులు హోటల్‌కు చేరుకుని గదులు లేవని తెలిసి షాక్‌కు గురయ్యారు.
Pakistan Hockey Team Humiliation | ఫెడరేషన్ వైఫల్యం..
పరిస్థితిని చక్కదిద్దేందుకు జట్టు హెడ్ కోచ్ తాహిర్ జమాన్ పాకిస్థాన్‌లోని Pakistan Hockey Federation మరియు Pakistan Sports Board అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినా తక్షణ స్పందన లభించలేదు. దీంతో జట్టు సభ్యులు హోటల్ వెలుపలే గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. చివరికి హోటల్ యాజమాన్యంతో చర్చల అనంతరం పరిమిత సంఖ్యలో గదులను కేటాయించగా, ఒకే గదిలో ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లు సర్దుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి జట్టు వసతి కోసం పీఎస్బీ (PCB) ఇప్పటికే పీహెచ్ఎఫ్కు సుమారు 49 వేల డాలర్ల నిధులను విడుదల చేసినట్లు సమాచారం. అయినప్పటికీ హోటల్ బిల్లు చెల్లించకపోవడం ఫెడరేషన్ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఈ గందరగోళం జరిగిన మరుసటి రోజే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 2–3 తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్ ఓడిపోవడం గమనార్హం.
ఈ సంఘటన పాకిస్థాన్ క్రీడా వ్యవస్థలో ఉన్న ఆర్థిక సమస్యలు, పరిపాలనా లోపాలను మరోసారి బయటపెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా జరిగిన ఈ ఘటనపై క్రీడాభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.