Homeఅంతర్జాతీయంSalman Khan | సల్మాన్‌ఖాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన పాకిస్థాన్​.. మండిపడుతున్న ఫ్యాన్స్​!

Salman Khan | సల్మాన్‌ఖాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన పాకిస్థాన్​.. మండిపడుతున్న ఫ్యాన్స్​!

Salman Khan | బాలీవుడ్​ హీరో సల్మాన్​ ఖాన్​ను పాకిస్థాన్​ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల బలూచిస్థాన్​ విషయంలో ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ఈ చర్యలు చేపట్టింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Salman Khan | బాలీవుడ్​ (Bollywood) హీరో సల్మాన్​ఖాన్​ను పాకిస్థాన్​  (Pakistan) ఉగ్రవాదిగా ప్రకటించింది. సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో బలూచిస్థాన్ గురించి సల్మాన్ చేసిన ప్రకటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ చర్యలకు పాల్పడింది.

సల్మాన్‌ ఖాన్‌ ఇటీవల సౌదీలో (Saudi) జరిగిన జాయ్‌ ఫోరంలో (Joy Forum) పాల్గొన్నారు. ఈ సందర్భంగా యన మాట్లాడుతూ.. పాకిస్థాన్​, బలూచిస్థాన్​లను వేర్వేరు దేశాలుగా ప్రస్తావించారు. కాగా.. పాక్​లోని బలూచిస్థాన్​ కొద్దికాలంగా తమకు స్వాతంత్య్రం కావాలని పోరాడుతోంది. ఇప్పటికే బలూచ్​ వేర్పాటువాదులు పాక్​ సైనికులపై దాడులకు పాల్పడుతున్నారు. దీంతో బలూచ్​ ప్రజలను దాయాదీ దేశం అణచివేస్తోంది. ఈ క్రమంలోనే సల్మాన్​ ఖాన్​ వ్యాఖ్యలు పాక్​లో తీవ్ర దుమారం లేపాయి. ఆయన వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో వైరల్ కావడంతో పాకిస్థాన్ ప్రభుత్వం సల్మాన్‌ను ఒక ఉగ్రవాదిగా ముద్రవేసింది. పాకిస్థాన్ 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలోని 4వ షెడ్యూల్ కింద ఆయన పేరును చేర్చడం గమనార్హం.

Salman Khan | సల్మాన్​ ఏమన్నారంటే..

సౌదీ అరేబియాలో జరిగిన ‘జాయ్‌ ఫోరమ్‌ 2025’ కార్యక్రమంలో సల్మాన్​ఖాన్​తో పాటు షారుక్‌ ఖాన్‌, అమిర్‌ఖాన్‌ వంటి స్టార్స్‌ పాల్గొన్నారు. సల్మాన్‌ మాట్లాడుతూ.. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందన్నారు. హిందీ సినిమాను సౌదీలో విడుదల చేస్తే తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుందని చెప్పారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఉండటమే ఇందుకు కారణమని ఆయన అన్నారు. పాకిస్థాన్​, బలూచిస్థాన్​, అఫ్గానిస్థాన్​ దేశాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఎక్కువగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే పాక్​, బలూచిస్థాన్​ వేర్వేరు దేశాలుగా సల్మాన్​ మాట్లాడడంతో పాక్​ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Salman Khan | బలూచిస్థాన్​ ప్రశంసలు

సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్​ ఆగ్రహం వ్యక్తం చేయగా.. బలూచిస్థాన్​ ప్రజలు మాత్రం ప్రశంసలు కురిపించారు. బలూచ్​ వేర్పాటువాద నాయకులు సల్మాన్​ వ్యాఖ్యలను స్వాగతించారు. ఇలా మాట్లాడేందుకు చాలా దేశాలు వెనకడుగు వేశాయన్నారు. కాగా.. బలూచిస్థాన్​లోని సహజ వనరులతో డబ్బులు సంపాదిస్తున్న పాక్​ ప్రభుత్వం అక్కడ అభివృద్ధి మాత్రం చేయడం లేదు. దీంతో కొంతకాలంగా ఆ ప్రాంత ప్రజలు ప్రత్యేక దేశం కావాలని పోరాడుతున్నారు. అయితే సల్మాన్​ఖాన్​ను ఉగ్రవాదిగా ప్రకటించడంతో ఆయన ఫ్యాన్స్​ పాక్​పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.