అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pak Defense Minister | పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి కవ్వించేలా వ్యాఖ్యలు చేశారు. అఫ్ఘానిస్తాన్‌తో ఇండియా సంబంధాలు పెంచుకోవడంపై అక్కసు వెళ్లగక్కారు. భారత్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
అవసరమైతే అటు తాలిబాన్లతో, ఇటు భారత్‌తో ఇస్లామాబాద్ రెండు వైపులా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉందని ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. నిర్దిష్ట వివరాలను పంచుకోవడానికి నిరాకరించినప్పటికీ, వ్యూహాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేశారు.
Pak Defense Minister | అఫ్ఘాన్ వలసలపై అక్కసు..
పాకిస్తాన్‌లోని అఫ్ఘాన్ శరణార్థులను లక్ష్యంగా చేసుకుని ఆసిఫ్ మరోసారి విమర్శలు చేశారు. వారు తమ దేశానికి ఉగ్రవాదం తప్ప మరేమీ తీసుకురాలేదని, స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించారు. “మనం వారి నుంచి ఏమి పొందాము? ఉగ్రవాదం తప్ప మరేమీ లేదు,” అని వ్యాఖ్యానించారు. “ఇప్పుడు అఫ్ఘాన్‌లో పరిస్థితి మెరుగుపడుతోంది కాబట్టి, మెజారిటీ అఫ్ఘాన్లు తిరిగి వెళ్లాలని” సూచించారు. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం (Pakistan Government) అఫ్ఘాన్ వలసదారులపై అణిచివేత చర్యలు ప్రారంభించింది. ఈ ప్రక్రియ మానవ హక్కుల సంఘాల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.
Pak Defense Minister | ఇండియా తరఫున వకాల్తా..
తాలిబన్లు భారతదేశం తరపున వకాల్తా పుచ్చుకున్నారని ఆసిఫ్ ఆరోపించారు. ఢిల్లీ నిధులు సమకూర్చుతూ ప్రాక్సీ యుద్ధం చేస్తోందన్నారు. “అఫ్ఘాన్ తాలిబన్ల నిర్ణయాలను ఢిల్లీ స్పాన్సర్ చేస్తోంది.. కాబూల్ భారతదేశం (India) కోసం ప్రాక్సీ యుద్ధం చేస్తోంది” అని ఆసిఫ్ పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా రహస్య ప్రణాళికను సూచిస్తూ తాలిబన్ విదేశాంగ మంత్రి ముత్తాకి ఇటీవల భారతదేశంలో చేసిన పర్యటనను ఈ సందర్భంగా ఆయన ఎత్తి చూపారు.
Pak Defense Minister | పెరుగుతున్న ఘర్షణలు
పాకిస్తాన్ – అప్ఘానిస్తాన్ (Afghanistan) మధ్య సైనిక ఘర్షణలు తీవ్రమయ్యాయి. కాబూల్, కాందహార్‌లోని తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ శిబిరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత ఉద్రిక్తత నెలకొంది. ప్రతీకార దాడులతో ప్రతిస్పందించి తాలిబాన్.. 58 మంది పాకిస్తాన్ సైనికులను చంపి, ట్యాంకులతో సహా సైనిక పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు, పాకిస్తాన్ కూడా దాడులు చేసి 200 మంది ఉగ్రవాదులను తటస్థీకరించినట్లు తెలిపింది. మరోవైపు, సౌదీ అరేబియా, ఖతార్ మధ్యవర్తిత్వంతో ప్రకటించిన 48 గంటల కాల్పుల విరమణ విఫలమయ్యాయి. పాకిస్తాన్ నుంచి స్వాధీనం చేసుకున్న ట్యాంకులతో తాలిబాన్ యోధులు కవాతు చేయడం, సైనికుల ఆయుధాలను ప్రదర్శించడం ఇస్లామాబాద్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది.