Homeఅంతర్జాతీయంPakistan Army | పాకిస్థాన్ సైన్యంలో భారీ సంస్కరణలు.. భార‌త్‌తో యుద్ధం త‌ర్వాత మార్పులు

Pakistan Army | పాకిస్థాన్ సైన్యంలో భారీ సంస్కరణలు.. భార‌త్‌తో యుద్ధం త‌ర్వాత మార్పులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pakistan Army | పాకిస్థాన్ తన సైనిక వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. త్రివిధ దళాల మధ్య సమన్వయం పెంపు, ఏకీకృత కమాండ్ వ్యవస్థ ఏర్పాటుతో సైనిక వ్యవస్థను (military system) మరింత శక్తివంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందుకోసం ప్రభుత్వం ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్’ (Chief of Defense Forces) అనే కొత్త పదవిని సృష్టించేందుకు నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన 27వ రాజ్యాంగ సవరణ బిల్లును (Constitutional Amendment Bil) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 243లో సవరణ చేయనున్నారు. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఆర్మీ చీఫ్‌తో పాటు సీడీఎఫ్‌ను కూడా నియమిస్తారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌నే సీడీఎఫ్‌గా కొనసాగించే అవకాశం ఉందని సమాచారం.

Pakistan Army | భారత్‌తో ఘర్షణల తర్వాత కీలక నిర్ణయం

అదనంగా, ప్రధానమంత్రితో సంప్రదించి నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ అధిపతిని కూడా ఆర్మీ చీఫ్‌నే నియమించే అవకాశం ఉంది. ఇక జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ పదవి 2025 నవంబర్ 27న అధికారికంగా రద్దు కానుంది. ఈ నిర్ణయం వెనుక ఇటీవల భారత్‌తో జరిగిన సరిహద్దు ఉద్రిక్తతలే కారణమని పాకిస్థాన్ మీడియా (Pakistani media) పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో జరిగిన నాలుగు రోజుల సైనిక ఘర్షణల అనంతరం, పాకిస్థాన్ తమ రక్షణ వ్యవస్థలో (defense system) సమగ్రత లోపించిందని గుర్తించింది. ఆధునిక యుద్ధ తంత్రాలకు అనుగుణంగా “సమీకృత కార్యాచరణ” అవసరమని తేల్చి ఈ సంస్కరణలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి (terrorist attack) ప్రతిస్పందనగా భారత్ మే 7న “ఆపరేషన్ సిందూర్” పేరుతో పాక్‌ నియంత్రణలోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్ సైన్యానికి చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాలతో పాటు డజనుకు పైగా విమానాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పాక్ సైన్యం ఎదుర్కొన్న నష్టాల కారణంగా.. ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు (Army Chief General Asim Munir) ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Prime Minister Shehbaz Sharif) ప్రస్తుతం అజర్‌బైజాన్ పర్యటనలో ఉండగా, వీడియో లింక్ ద్వారా కేబినెట్ సమావేశం నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలిపారు.

అనంతరం న్యాయశాఖ మంత్రి ఆజం నజీర్ తరార్ సెనేట్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. అయితే, ప్రతిపక్ష పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రభుత్వం తొందరపడి బిల్లును ముందుకు తెచ్చిందని విమర్శించింది. చర్చకు తగిన సమయం ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం బిల్లును సెనేట్ ఛైర్మన్ యూసుఫ్ రజా గిలానీ న్యాయ, శాసన వ్యవహారాల స్టాండింగ్ కమిటీలకు పంపారు. కమిటీల నివేదిక సమర్పించిన తర్వాత పార్లమెంట్‌లో దీనిపై తుది చర్చ జరగనుంది. ఈ సంస్కరణలతో పాకిస్థాన్ సైన్య వ్యవస్థలో కొత్త శకం ఆరంభమవుతుందని రక్షణ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Must Read
Related News