Homeతాజావార్తలుKartika Brahmotsavam | వైభవంగా ప్రారంభమైన పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

Kartika Brahmotsavam | వైభవంగా ప్రారంభమైన పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు సాయంత్రం అమ్మవారు చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kartika Brahmotsavam | తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (Kartika Brahmotsavam) సోమవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు.

అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, నిత్య అర్చన జరిపారు. అనంతరం మాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం (Tiruchi Utsavam) జరిపి, ధ్వజ స్థంభ తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9.15 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Kartika Brahmotsavam | భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు

ఈవో అనిల్ కుమార్ సింఘాల్ (EO Anil Kumar Singhal) మీడియాతో మాట్లాడుతూ, సోమవారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూల మూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సోమవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అమ్మవారు చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

Kartika Brahmotsavam | పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆలోచనల మేరకు టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. బ్రహ్మోత్సవాల్లో పంచమి తీర్థం రోజున 50 వేలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Kartika Brahmotsavam | ఉత్సవాలకు రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో పద్మావతి అమ్మవారిని, శ్రీవారిని దర్శించుకునేందుకు రానున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో విజివో గిరిధర్, ఏవీఎస్వో రాధాకృష్ణ మూర్తి, టీటీడీ ఏఈవో దేవరాజులు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News