అక్షరటుడే, వెబ్‌డెస్క్: packaged spice | ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సమయం దొరకక చాలామంది ‘రెడీ టు యూజ్’ ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ సౌకర్యం వెనుక భారీ ఆరోగ్య ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం నిత్యం వంటల్లో వాడే కారం, పసుపు, మసాలా పొడులు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి, అవి ఉండలు కట్టకుండా ఉండటానికి వ్యాపారులు ‘అల్యూమినియం సాల్ట్స్’ (ఆలమ్ స్పైస్) అనే హానికర రసాయనాలను వాడుతున్నారు.
అల్యూమినియం సాల్ట్స్: శాస్త్రీయంగా దీనిని ‘అల్యూమినియం పొటాషియం సల్ఫేట్’ అంటారు. దీనిని ‘యాంటీ కేకింగ్ ఏజెంట్’గా వ్యవహరిస్తారు. ప్యాకింగ్ చేసిన కారం, పసుపు వంటి పొడులు తేమ వల్ల గడ్డకట్టకుండా, ఎప్పుడూ పొడిపొడిగా ఉండేలా ఇది దోహదపడుతుంది. ఆహార భద్రతా నిబంధనల ప్రకారం దీనిని చాలా తక్కువ మోతాదులో వాడాలి. కానీ, లాభాలే లక్ష్యంగా భావించే కొందరు వ్యాపారులు దీనిని పరిమితికి మించి కలుపుతూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఆరోగ్య సమస్యలు: ఈ రసాయనాలు కలిపిన మసాలాలను దీర్ఘకాలం పాటు వాడటం వల్ల నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. దీని ప్రభావం ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులపై అధికంగా ఉంటోంది.
packaged spice | నష్టాలు ఇవే:
నాడీ వ్యవస్థ ప్రభావితమై నరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. 50 ఏళ్లు దాటిన వారిలో వచ్చే మతిమరుపు సమస్యలకు, ఈ ‘ఆలమ్ స్పైస్’ వాడకానికి ప్రత్యక్ష సంబంధం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎదిగే పిల్లల్లో శారీరక వికాసంపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఈ రసాయనాలు ఆహారం రంగును, రుచిని మార్చవు కాబట్టి వీటిని గుర్తించడం చాలా కష్టం. అందుకే, మార్కెట్‌లో లభ్యమయ్యే ఆకర్షణీయమైన ప్యాకెట్లను ఆశ్రయించడం కంటే, సొంతంగా ఎండుమిర్చి, పసుపు కొమ్ములు కొనుగోలు చేసి ఇంటి వద్దే పొడి చేయించుకోవడం సురక్షితం. ఆరోగ్యకరమైన జీవనం కోసం మనం తీసుకునే ఆహార నాణ్యత విషయంలో రాజీ పడకూడదు.