అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ISRO Chairman | అంతరిక్ష పరిశోధనల్లో భారత్ దూసుకెళ్తోందని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శనివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఇస్రో చేపట్టనున్న ప్రయోగాల గురించి వివరించారు. 2035 నాటికి భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రం భారతీయ అంతరిక్ష్ స్టేషన్ (Indian Space Station) ఉంటుందని తెలిపారు. మొదటి మాడ్యూల్ 2028 నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు.
ISRO Chairman | 2040 నాటికి చంద్రుడిపైకి..
చంద్రుడిపైకి చేరుకునేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోందని నారాయణన్ (ISRO Chairman Narayan) తెలిపారు. ప్రధాని మోదీ నెక్స్ట్ జనరేషన్ లాంచర్‌కు ఆమోదం తెలిపారని, 2040 నాటికి ఇండియా చంద్రునిపై కాలు మోపుతుందన్నారు. 2040 నాటికి భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ప్రపంచ అంతరిక్ష కార్యక్రమంతో సమానంగా ఉంటుందని చెప్పారు. “మనకు చంద్రయాన్-4 మిషన్ ఉంటుంది. వీనస్ ఆర్బిటర్ మిషన్ ఉంటుంది. 2035 నాటికి మనకు BAS అనే అంతరిక్ష కేంద్రం ఉంటుంది. 2028 నాటికి మొదటి మాడ్యూల్ అందుబాటులోకి వస్తుంది. ప్రధానమంత్రి NGLకు (నెక్స్ట్ జనరేషన్ లాంచర్) ఆమోదం తెలిపారు. 2040 నాటికి మన శాస్త్రవేత్తలను చంద్రునిపైకి పంపించి సురక్షితంగా తిరిగి తీసుకురానున్నాం. తద్వారా 2040 నాటికి భారత అంతరిక్ష కార్యక్రమం ప్రపంచంతో సమాన స్థాయిలో ఉంటుంది” అని ఆయన వివరించారు.
అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చిన శుభాంషు శుక్లాను నారాయణన్ ప్రశంసించారు. గగన్‌యాత్రని చేపట్టడానికి ముందు ఎవరినైనా ISSకి పంపాలనేది ప్రధాని మోదీ (Prime Minister Modi) ఆలోచన అని తెలిపారు. “మా గగన్‌యాత్రికులలో ఒకరిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడం ప్రధాన విజయాలలో ఒకటి. గగన్‌యాత్ర చేపట్టడానికి ముందు వారిలో ఒకరిని ISSకి పంపాలనేది ప్రధాని ఆలోచన. ఆయన దార్శనికత నేడు గొప్ప విజయానికి దారితీసింది. శుక్లా ISSకి వెళ్లి సురక్షితంగా తిరిగి వచ్చారు. అతడితో కలిపి నలుగురు శాస్త్రవేత్తలు గగన్‌యాత్ర ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.” అని నారాయణన్ తెలిపారు.