అక్షరటుడే, వెబ్డెస్క్ : Maredu Dalam | అభిషేక ప్రియుడైన పరమశివుడి ఆరాధనలో బిల్వ పత్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ‘మారేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు.. గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు’ అని భక్త కన్నప్ప(Bhaktha Kannappa) పాడుకున్నట్లుగా ఆ మహాదేవుడిని అభిషేకించి, బిల్వ పత్రాలతో పూజిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయన్నది భక్తుల నమ్మకం. ఈ బిల్వ పత్రాలు పలు రకాలుగా ఉంటాయి. ఎక్కువగా త్రిపత్ర బిల్వాలను ఉపయోగించినా.. శివపూజకు అన్నీ అర్హమైనవే.. వీటిని వాటి ఆకారం, ఆకుల సంఖ్య ఆధారంగా వర్గీకరిస్తారు. ఇవి సాధారణంగా త్రిఫోలియేట్ (మూడు ఆకులు కలిసిన సమూహం)లా ఉంటాయి. ఆకుల సంఖ్య లేదా ఆకారంలో స్వల్ప వ్యత్యాసాలూ ఉంటాయి. వాటి ఆధారంగా బిల్వ పత్రాలను(Bilva Patralu) మూడు రకాలుగా విభజించారు.
Maredu Dalam | ఏక పత్ర బిల్వం
బిల్వ వృక్షంలో ఒకే ఆకు ఉన్న కాండం అరుదుగా కనిపిస్తుంది. ఇవి సాధారణంగా చిన్నగా ఉంటాయి. ఈ ఏక పత్ర బిల్వాలను(Eka Bilva Patram) కూడా శివపూజలో ఉపయోగిస్తారు. కానీ త్రిపత్ర ఆకులంత ప్రాచుర్యం లేదు. ఇవి శివుడి ఏకత్వాన్ని సూచిస్తాయని భక్తులు నమ్ముతారు. త్రిపత్ర బిల్వాలు అందుబాటులో లేనప్పుడు, ప్రత్యేక సందర్భాలలో వీటిని ఉపయోగిస్తారు.
Maredu Dalam | త్రిపత్ర బిల్వం
ఇది బిల్వ వృక్షం యొక్క సాధారణ ఆకు రూపం. ఒకే కాండంపై మూడు ఆకులు (త్రిఫోలియేట్) కలిసి ఉంటాయి. ఈ మూడు ఆకులు ఆ పరమశివుడి మూడు నేత్రాలని భావిస్తారు. వీటిని త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర) స్వరూపంగానూ పేర్కొంటారు. శివపూజలో ఇవి అత్యంత పవిత్రమైనవిగా భావించబడుతున్నాయి. శివలింగం(Shiva Linagam)పై ఈ ఆకులను సమర్పించడం ద్వారా విశేష ఫలితాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం.
Maredu Dalam | పంచ పత్ర బిల్వం
ఒకే కాండంపై ఐదు ఆకులు కలిసి ఉండే బిల్వ పత్రాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇవి అసాధారణమైనవి, అత్యంత పవిత్రమైనవిగా భావించబడుతున్నాయి. ఈ ఆకులు పంచభూతాలను (భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం) సూచిస్తాయి. ఈ ఆకులు చాలా అరుదుగా లభిస్తాయి కాబట్టి వీటిని శివపూజ(Shiva Pooja)లో ఉపయోగించడం ద్వారా ప్రత్యేక ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.