అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | ఉస్మానియా యూనివర్సిటీని (OU) అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించి, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. బుధవారం ఆయన యూనివర్సిటీలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ ఎదుట బహిరంగ సభలో ప్రసంగించారు.
తెలంగాణ గడ్డ నుంచి అనేక పోరాటాలు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చదువు లేకున్నా ఎంతో మంది అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. సాయుధ పోరాటం జరిపి దొరల పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. అణిచివేతకు గురైనప్పుడే పోరాటం పుడుతుందన్నారు. అడవుల్లో పుట్టిన కొమురంభీం చదువుకోలేదని, కానీ ఆధిపత్యం చెలాయించినవారిపై కొమురంభీం ఉద్యమాన్ని రగిలించారని గుర్తు చేశారు. బడికి వెళ్లని అందెశ్రీ తెలంగాణ ఉద్యమ గేయాన్ని రచించారని తెలిపారు.
CM Revanth Reddy | కాలగర్భంలో కలిపే కుట్ర
తెలంగాణ కోసం ఆరు దశాబ్దాలు ఎదురు చూశామని సీఎం అన్నారు. ఓయూలోనే తొలి దశ ఉద్యమం పుట్టిందన్నారు. ఆ ఉద్యమం ఫలించక పోవడంతోనే విద్యార్థులు అడవి బాట పట్టారని పేర్కొన్నారు. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాలకు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిలిచిందన్నారు. అలాంటి యూనివర్సిటీని కొంతమంది కాలగర్భంలో కలిపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పరోక్షంగా కేటీఆర్‌పై (KTR) విమర్శలు చేశారు. కానీ తమ ప్రభుత్వం యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దుతుందన్నారు.
CM Revanth Reddy | అభిమానం ఉండాలి
గుండెల నిండా అభిమానంతో ఓయూకు వచ్చానని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఓయూలో మంత్రులు, సీఎంలను అడ్డుకునే చరిత్ర ఉందని కొందరు తనకు చెప్పారన్నారు. మీరు చాలా ధైర్యం చేస్తున్నారని కొందరు అన్నారని పేర్కొన్నారు. తనది ధైర్యం కాదు, అభిమానం అని సీఎం తెలిపారు. ‘నా తమ్ముళ్లు ఉన్న యూనివర్సిటీకి వెళ్లేందుకు ధైర్యం అవసరమా.. గుండెల నిండా అభిమానంతో భవిష్యత్ ప్రణాళిక కోసం ఇక్కడికి వచ్చా’ అని స్పష్టం చేశారు.
CM Revanth Reddy | ఎందరో వీరులను అందించింది
ఉస్మానియా యూనివర్సిటీ ఎందరో వీరులను తెలంగాణకు అందించిందని సీఎం తెలిపారు. జార్జిరెడ్డి, గద్దర్ (Gaddar) వంటి వీరులు ఇక్కడి నుంచే వచ్చారన్నారు. అలాగే అనేక మంది మేధావులు ఇక్కడ చదువుకున్నారని తెలిపారు. తెలంగాణ భవిష్యత్‌కి పునాది వేసింది ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పారు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ. 1000 కోట్లు విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో విద్య అందుబాటులో ఉంది, కానీ నాణ్యమైన విద్యలేదన్నారు. ఇంజినీర్లకు కొదవలేదు, కానీ స్కిల్ ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ (Skill University) ఏర్పాటు చేశామని తెలిపారు.