Homeక్రైంChevella Accident | బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశం.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

Chevella Accident | బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశం.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

చేవెళ్ల బస్సు ప్రమాద మృతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతులకు రూ.5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.2 లక్షలు పరిహారం ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella Accident | చేవెళ్ల బస్సు ప్రమాద (Chevella Bus Accident) ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడ్​తో వెళ్తున్న లారీ ఢీకొన్న విషయం తెలిసిందే. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ చేవెళ్ల ఆస్పత్రి (Chevella Hospital) ని సందర్శించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు.

పొన్నం మాట్లాడుతూ.. ఇది ఒక దుర్ఘటన అన్నారు. రాజకీయాలు మాట్లాడే సమయం కాదని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 19 మంది మృతి చెందారని ఆయన తెలిపారు. కొంత మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారన్నారు.

Chevella Accident | మృతులకు రూ.5 లక్షల పరిహారం

మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది. మృతుల కుటుంబాలకు ఆర్టీసీ తరఫున రూ.2 లక్షల పరిహారం ఇస్తామని మంత్రి పొన్నం (Ponnam Prabhakar) వెల్లడించారు. రోడ్డు విస్తరణను ఎవరు అడ్డుకున్నారు అనేది త్వరలో బయటకు వస్తుందని ఆయన అన్నారు.

Chevella Accident | ప్రధాని దిగ్భ్రాంతి

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ (Prime Minister Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.