అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Oracle Layoffs | ప్రపంచ టెక్ దిగ్గజం ఒరాకిల్ తన చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్‌కు సిద్ధమవుతోందన్న వార్తలు ఐటీ రంగంలో కలకలం రేపుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టు (Artificial Intelligence Project)లపై భారీగా పెట్టుబడులు పెట్టడం, నిధుల కొరత తీవ్రంగా ఎదురవడం వల్ల దాదాపు 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తొలగించే యోచనలో కంపెనీ ఉన్నట్లు సమాచారం.
ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ టీడీ కోవెన్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెలుగులోకి రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఏఐ రంగంలో అగ్రస్థానాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా భారీ డేటా సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
Oracle Layoffs | షాకింగ్ నిర్ణయాలు..
ముఖ్యంగా ఓపెన్ ఏఐ వంటి సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సుమారు 156 బిలియన్ డాలర్ల వరకు వ్యయం చేస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. అయితే కంపెనీ ఆర్థిక పరిస్థితిపై అనిశ్చితి నెలకొనడంతో అమెరికా బ్యాంకులు (American Bank) రుణాలివ్వడంలో వెనుకంజ వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపుల ద్వారా 8 నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు నగదు ఆదా చేయాలని ఒరాకిల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. నిధుల కొరత ప్రభావం కేవలం ఉద్యోగులపైనే కాకుండా కస్టమర్లపైనా పడుతోంది. కొత్తగా సేవలు తీసుకునే కస్టమర్లు తమ ఫీజులో 40 శాతం ముందుగానే చెల్లించాలని కంపెనీ షరతులు విధిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు “మీ చిప్స్ మీరే తెచ్చుకోండి” అనే విధానాన్ని కూడా పరిశీలిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. డేటా సెంటర్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుండటంతో ఓపెన్ ఏఐ వంటి పెద్ద సంస్థలు తమ క్లౌడ్ అవసరాల కోసం మైక్రోసాఫ్ట్, అమెజాన్ (Amazon) వంటి ప్రత్యర్థి కంపెనీల వైపు చూస్తున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ఖర్చులను తగ్గించే చర్యల్లో భాగంగా 2022లో 28 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన హెల్త్‌కేర్ సాఫ్ట్వేర్ సంస్థ ‘సెర్నర్’ను విక్రయించే ఆలోచనలో కూడా ఒరాకిల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గతంలో వేలాది మంది ఉద్యోగులను తొలగించిన సంస్థ, మరో భారీ కోతకు సిద్ధమవుతుండటం గ్లోబల్ ఐటీ (Global IT) రంగాన్ని కలవరపెడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఒరాకిల్ ఇప్పుడు ఆసియా బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది. అయితే అక్కడ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం కంపెనీకి మరింత ఆర్థిక భారం తెచ్చిపెడుతోంది. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని హైదరాబాద్, బెంగళూరు (Bangalore) కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై కూడా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వారంలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి.