అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India Alliance | లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఇండి కూటమి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు వ్యాఖ్యలను అసాధారణమైన, అనవసరమైన వ్యాఖ్యలని తప్పుబట్టింది. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడడం ప్రతిపక్ష నాయకుడి బాధ్యత అని, సరిహద్దులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైతే మాట్లాడకూడదా? ప్రశ్నించింది.
మంగళవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో సమావేశమైన విపక్ష కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశంలో సుప్రీంకోర్టు(Supreme Court) వ్యాఖ్యలపై చర్చ జరిగింది. రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను కూటమి నాయకులు తీవ్రంగా విమర్శించారు, వాటిని “అసాధారణ”, అనవసరం లేని వ్యాఖ్యలని” అభివర్ణించారు.
India Alliance | రాహుల్‌కు బాటసగా కూటమి..
చైనా భారత సరిహద్దులను ఆక్రమించిందని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా తప్పుబట్టింది. నిజమైన భారతీయుడు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయగలడా? అని ప్రశ్నించింది. వాక్ స్వాతంత్ర హక్కు పేరిట ఏది పడితే అది మాట్లాడడం కుదరదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ఆక్షేపణల నేపథ్యంలో ఇండి కూటమి రాహుల్‌కు బాసటగా నిలిచింది.
ప్రతిపక్ష నాయకుడిగా దేశ భద్రత ప్రమాదంలో పడినప్పుడు స్పందించడం ఆయన బాధ్యత అని పేర్కొంది. “ఈరోజు (మంగళవారం) ఉదయం INDIA ఫ్లోర్ లీడర్ల సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి (Supreme Court Sitting Judge) చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగింది. రాజకీయ పార్టీల ప్రజాస్వామ్య హక్కులపై సిట్టింగ్ జడ్జి అసాధారణమైన వ్యాఖ్యలు చేశారని నేతలంతా ఏకగ్రీవంగా అంగీకరించారని” ఇండి కూటమి ఓ ప్రకటనలో పేర్కొంది. “జాతీయ ప్రయోజనానికి సంబంధించిన అంశాలపై వ్యాఖ్యానించడం రాజకీయ పార్టీల బాధ్యత, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడి బాధ్యత. మన సరిహద్దులను రక్షించడంలో ప్రభుత్వం ఇంత అద్భుతంగా విఫలమైనప్పుడు, దానిని జవాబుదారీగా ఉంచడం ప్రతి పౌరుడి నైతిక విధి” అని ప్రకటన తెలిపింది.
India Alliance | భారతీయుడు చేసే వ్యాఖ్యలేనా?
భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. “2000 చదరపు కిలోమీటర్లను చైనా ఎప్పుడు స్వాధీనం చేసుకుందో మీకు ఎలా తెలుసు? అందుకు మీ దగ్గర విశ్వసనీయమైన సమాచారం ఏమిటి? నిజమైన భారతీయుడు అలా ఎలా అనలగడు. సరిహద్దు వెంబడి వివాదం జరిగినప్పుడు, మీరు ఇదంతా చెప్పగలరా?” జస్టిస్ దత్తా.. రాహుల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి(Abhishek Singhvi)ని ప్రశ్నించారు. ఎవరైనా ఏదైనా మాట్లాడడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) అనుమతించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.