అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రతిపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) యోచిస్తోంది. అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా కేంద్రాన్ని ఇరుకున బెట్టాలని భావిస్తోంది. ఉభయ సభల్లో సరిపడా బలం లేకపోయినప్పటికీ పోటీకి దిగాలని, ఎన్నిక ఏకగ్రీవం కానీయకుండా చూడాలని ఇండి కూటమి యోచిస్తోంది. త్వరలోనే పార్టీలన్నీ సమావేశమై ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Vice President | సమాలోచనలు..
ఉప రాష్ట్రపతి పదవి నుంచి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా తప్పుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల(Parliament Monsoon Session) తొలి రోజే ఆయన రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. పలు అంశాలపై కేంద్రంతో ఏర్పడిన విభేదాల వల్ల ఆయన తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడంతో ఉప రాష్ట్రపతి(Vice President) ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని పోటీ పెట్టాలని ఇండి కూటమి యోచిస్తోంది. ఫలితం ఎలా ఉన్నా, బలమైన రాజకీయ సందేశాన్ని పంపడానికి ప్రతిపక్ష పార్టీలు బరిలోకి దిగాని భావిస్తోంది.
ఇదే విషయాన్ని ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Congress party president Mallikarjun Kharge) కూడా సూత్రప్రాయంగా వెల్లడించారు. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇండి కూటమి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. “మేము INDIA గ్రూప్ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీపై సమష్టిగా నిర్ణయం తీసుకుంటాము” అని ఖర్గే తెలిపారు.
Vice President | మెజార్టీ లేకపోయినా..
ఉప రాష్ట్రపతిని రాజ్యసభ(Rajya Sabha), లోక్‌సభ సభ్యులు(Lok Sabha Menbers) కలిసి ఎన్నుకుంటారు. నామినేట్ చేయబడిన వారితో సహా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తారు. ఉభయ సభల్లో మొత్తం 782 మంది సభ్యులు ఉండగా, ఉప రాష్ట్రపతిగా గెలవాలంటే 392 ఓట్లు రావాలి. రెండు సభల్లోనూ అధికార ఎన్డీయేకు స్పష్టమైన మెజార్టీ ఉంది.
లోక్‌సభలో, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 293 మంది సభ్యుల మద్దతు ఉండగా, విపక్ష కూటమికి 234 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో ఎన్డీయేకు 130 మంది సభ్యులు ఉండగా, ఇండి బ్లాక్‌కు 79 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి విపక్ష కూటమికి తగినంత బలం లేదు. అయినప్పటికీ రాజకీయంగా బీజేపీని ఇబ్బంది పెట్టాలనే యోచనతో పోటీకి దిగాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి భావిస్తోంది.