అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chief Election Commissioner | ఓట్ల చోరీ ఆరోపణలపై దీటుగా స్పందిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విపక్షాలు యోచిస్తున్నాయి. ఈ మేరకు ఇండి కూటమి పక్షాలు సంతకాలు సేకరించే పనిలో పడ్డాయి.
ఎన్నికల సంఘం (Election Commission) ఓట్ల చోరీకి పాల్పడుతోందని, బీజేపీకి అనుకూలంగా పని చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gndhi) పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం వారంలోగా డిక్లరేషన్ ఇవ్వాలని లేదా జాతికి క్షమాపణలు చెప్పాలని అల్టీమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను (CEC Gyanesh Kumar) తొలగించాలని కోరుతూ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండి కూటమి యోచిస్తోంది.
Chief Election Commissioner | అభిశంసన ఎందుకంటే..
సీఈసీపై అభిశంసన తీర్మానం (Impeachment Motion) తీసుకురావడానికి ప్రతిపక్షాలు రెండు కారణాలను పేర్కొంటున్నాయి. ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ద్వారా బీజేపీ(BJP)కి బీ టీమ్‌గా పనిచేస్తుండడం ఒక కారణంగా చెబుతున్నారు. అలాగే, డిక్లరేషన్ ఇవ్వాలని ప్రతిపక్ష నాయకులను బెదిరించడం, ఒత్తిడి చేయడం రెండో కారణంగా పేర్కొంటున్నారు. అభిశంసన వార్తలను కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ (Congress MP Syed Naseer Hussain) ధ్రువీకరించారు. జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసన తీర్మానం తీసుకురాబోతున్నారా అని ప్రశ్నించగా, “అవసరమైతే, నిబంధనల ప్రకారం ప్రజాస్వామ్యంలోని అన్ని ఆయుధాలను మేము ఉపయోగిస్తాం. ఇప్పటివరకు (అభిశంసన గురించి) మాకు ఎటువంటి చర్చలు జరగలేదు, కానీ అవసరమైతే, మేము ఏదైనా చేయగలమని” బదులిచ్చారు.
Chief Election Commissioner | కొనసాగిన నిరసనలు..
బీహార్‌లో చేపట్టిన ఎన్నికల ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను వ్యతిరేకిస్తూ విపక్షాలు సోమవారం కూడా నిరసనలు చేపట్టాయి. మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), అఖిలేష్ యాదవ్, అభిషేక్ బెనర్జీ, కనిమొళి, ఇతరులతో సహా ప్రతిపక్ష ఎంపీలు సోమవారం పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.