HomeUncategorizedBoycott Turkey | ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్‌.. బాయ్‌కాట్‌ తుర్కియేకు పెరుగుతున్న మద్దతు

Boycott Turkey | ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్‌.. బాయ్‌కాట్‌ తుర్కియేకు పెరుగుతున్న మద్దతు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Boycott Turkey | కృతజ్ఞత మరిచి పాక్‌(Pak)కు సహాయం చేసిన తుర్కియేకు గట్టి దెబ్బే తగులుతోంది. ఇప్పటికే ఆ దేశ యాపిల్స్‌(Apples)ను దిగుమతి చేసుకోవడానికి పుణె వ్యాపారులు నిరాకరించారు.

వారి బాటలోనే మన ట్రావెల్‌ ఏజెన్సీ(Travel agencies)లు ప్రయాణిస్తున్నాయి. గతంలో మాల్దీవులకు షాక్‌ ఇచ్చినట్లుగానే భారతీయులు తుర్కియేకు ట్రావెల్‌ బుకింగ్స్‌(Bookings) రద్దు చేసుకుంటూ కుక్కకాటుకు చెప్పు దెబ్బతో సమాధానమిస్తున్నారు. అజర్‌బైజాన్‌కూ ఇదే రీతిన బుద్ధి చెబుతున్నారు. ఆ రెండు దేశాలకు కొత్త బుకింగ్‌లు పడిపోవడంతో పాటు క్యాన్సలేషన్‌లు కూడా భారీగా పెరిగినట్లు ట్రావెల్‌ సంస్థలు వెల్లడిస్తున్నాయి.

జమ్మూకశ్మీర్​(Jammu kashmir)ని పహల్​గామ్​​లో ఉగ్రదాడి ఘటన జరిగిన తర్వాత భారత్‌ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌, పీవోకే(POK)లలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్‌ సిందూర్‌(Operation sindoor) చేపట్టి దాడులు చేసింది. ఈ సమయంలో పాకిస్తాన్‌కు తుర్కియే(Turkey) అనుకూలంగా వ్యవహరించింది. ఆ దేశం అందించిన డ్రోన్లను మనపై దాడికి పాక్‌ ఉపయోగించుకుంది.

ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor) సమయంలో తుర్కియేతో పాటు అజర్‌బైజాన్‌(Azerbaijan)లు పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై భారతీయులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘బాయ్‌కాట్‌ తుర్కియే’(Boycott Turkey) పేరుతో సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

మన ట్రావెల్‌ ఏజెన్సీలూ బాయ్‌కాట్‌ తుర్కియేకు మద్దతుగా నిలుస్తున్నాయి. తుర్కియేతో పాటు అజర్‌బైజాన్‌కు ఆన్‌లైన్‌ బుకింగ్‌(Online bookings)లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. వారం రోజుల్లో ఆ రెండు దేశాలకు కొత్త బుకింగ్‌లు 60శాతం పడిపోయాయని, గత సంవత్సరంతో పోల్చితే క్యాన్సలేషన్‌లు సైతం 250 శాతానికి చేరాయని మేక్‌ మైట్రిప్‌ (MakeMyTrip) తెలిపింది.

మన సాయుధ బలగాలపై గౌరవంతో పర్యాటకుల నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని మేక్‌ మై ట్రిప్‌ (MakeMyTrip) సంస్థ ప్రకటించింది. అత్యవసర ప్రయాణాలను మాత్రమే సూచిస్తున్నామని పేర్కొంది. ఈజీ మైట్రిప్‌ (EaseMyTrip) కూడా ఈ రెండు దేశాలకు బుకింగ్స్‌ నిలిపివేసింది. వారం రోజులుగా తుర్కియేకు 22 శాతం, అజర్‌బైజాన్‌కు 30 శాతం క్యాన్సలేషన్‌లు నమోదయ్యాయని ఆ సంస్థ తెలిపింది.

Boycott Turkey | పండ్ల వ్యాపారుల యుద్ధం..

కృతజ్ఞత మరిచి, వక్ర బుద్ధిని ప్రదర్శించిన తుర్కియేకు వ్యతిరేకంగా మహారాష్ట్రలోని పుణె(Pune)కు చెందిన పండ్ల వ్యాపారులు స్పందించారు. బాయ్‌కాట్‌ తుర్కియే అంటూ నినదిస్తున్నారు. తుర్కియే దేశం యాపిల్స్‌ను విక్రయించరాదని వారు నిర్ణయించారు.

సీజన్‌లో తుర్కియే ఆపిల్స్‌(Apples)కు పుణెలో రూ.వెయ్యి కోట్లకుపైనే టర్నోవర్‌ ఉంటుందని అంచనా. అయినా వ్యాపారులు తుర్కియే యాపిల్స్‌ను బహిష్కరించాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. ఇది ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదని, దేశానికి మద్దతుగా తీసుకున్న చర్య అని వ్యాపారులు పేర్కొంటున్నారు. తుర్కియే నుంచి దిగుమతి చేసుకునే బదులు హిమాచల్‌, ఉత్తరాఖండ్‌, ఇరాన్ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటామంటున్నారు.

Boycott Turkey : ఎప్పుడూ భారత్‌కు వ్యతిరేకమే..

2023లో తుర్కియేలో సంభవించిన భీకర భూకంప సమయంలో మన దేశం ‘ఆపరేషన్‌ దోస్త్’(Operation Dost) ద్వారా ఎంతో సాయం చేసింది. అయినప్పటికీ ఆ దేశం విశ్వాసాన్ని చూపకుండా మన ప్రత్యర్థికి సాయం అందిస్తోంది. గతంలో కశ్మీర్‌ అంశాన్ని పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించింది. భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడింది. ఇప్పుడు సైతం తన దుష్ట బుద్ధిని ప్రదర్శించింది. దీంతో భారతీయులు ఆ దేశానికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు.