అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను (Operation Kagar) తక్షణమే ఆపి మావోయిస్టులను (Maoists) చర్చలకు పిలవాలని సీపీఐఎంల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని కామ్రేడ్ పిట్ల ఎల్లన్న స్మారక స్థూపం వద్ద మంగళవారం అమరవీరులకు నివాళులర్పించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు బాకారం గంగారెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది కామ్రేడ్లు అమరులయ్యారని పేర్కొన్నారు. దేశంలో కష్టజీవుల రాజ్యం రావాలని దోపిడీ, పీడన లేని సమాజం కోసం చేసిన పోరులో కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర్లు, రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య, ప్రసాద్‌లాంటి వీరులు అమరులయ్యారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇందూర్ విప్లవోద్యమ నిర్మాణంలో కామ్రేడ్లు పిట్ల ఎల్లన్న, శావులం సాయిలు, వేములపల్లి కిరణ్ కూమార్‌ల ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్నారు.
Bheemgal | కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం..
ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (central and state governments) ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యాయని భాస్కర్ విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మోదీ ప్రభుత్వం (Modi government) ఆదివాసులను అణచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు, ఆదివాసులను హత్య చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు అల్తాఫ్, పీవైఎల్ జిల్లా నాయకుడు బాల్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.