అక్షరటుడే, వెబ్డెస్క్:Operation Kagar | సమ సమాజ స్థాపనే లక్ష్యంగా సగర్వంగా ఎగిరిన ఎర్రజెండా ఇప్పుడు దారం తెగిన పతంగిలా మారింది. ఒకనాడు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన నక్సలిజం(Naxalism) నేడు తుడిచి పెట్టుకుపోయే దుస్థికి చేరినట్లే కనిపిస్తోంది.
నక్సలిజాన్ని అంతమొందిస్తామన్న కేంద్రం ఆ దిశగా చేపట్టిన ఆపరేషన్ కగార్(Operation Kagar) అంతిమ దశకు చేరుకుంది. రాజ్యం నిర్బంధం, బలగాల దిగ్బంధంతో మావోయిస్టులకు ఊపిరి ఆడడం లేదు. వరుస ఎన్కౌంటర్లలో వందలాది మంది నేలకొరుగుతున్నారు. మరికొందరు జనజీవన స్రవంతిలో కలిసి పోతున్నారు. కేడర్ కనుమరుగై పోతున్న తరుణంలో, పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిన తరుణంలో మావోయిస్టు నాయకత్వం (Maoist leadership) పునరాలోచనలో పడింది. శాంతి చర్చలకు సిద్ధమంటూ కేంద్రం ఎదుట ప్రతిపాదిస్తోంది.
Operation Kagar | ఆధిపత్యాన్ని ఎదురించిన ఎర్రజెండా..
పల్లెల్లో అగ్రవర్ణాల ఆధిపత్యం.. పేదలపై దొరల పైశాచికత్వం.. అణగారిన వర్గాలపై అరాచకం.. ఒకనాడు పట్టి పీడించిన ఈ సామాజిక రుగ్మతలను అణగదొక్కేందుకు ఉద్భవించిందే నక్సలిజం. పేద, అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా మారిన నక్సల్బరీ ఉద్యమం అప్పట్లో అద్వితీయంగా ఎదిగింది. ఎర్రజెండాకు ఊరూరా అభిమానం పెరిగింది. ప్రజల మద్దతుతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. అప్పటిదాకా పల్లెలను పట్టి పీడిస్తున్న దొరల ఆధిపత్యానికి నక్సల్స్(Naxals) రాకతో తెరపడింది. దొరల ఆధీనంలో ఉన్న భూముల్లో ఎర్రజెండాలు వెలిశాయి. ఎక్కువ చేసే వారి మక్కెళ్లు విరిగాయి.
Operation Kagar | నమ్మిన సిద్ధాంతం కోసం..
నక్సలైట్లు(Naxalites) తుపాకీతోనే సమ సమాజ సామ్రజ్య స్థాపన అని విశ్వసించారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరుబాట పట్టారు. దశాబ్దాలుగా అజ్ఞాత వాసంలో ఉంటూ రాజ్యంతో పోరాటం చేస్తున్నారు. వీరి సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఎంతో మంది మేధావులు అడవులబాట పట్టారు. దొరల నిరంకుశత్వాన్ని, ప్రభుత్వ ఆధిపత్యాన్ని ఎదురిస్తూ పేదలకు అండగా నిలిచారు. 90వ దశకం వరకు ఉవ్వెత్తున ఎగిసిన నక్సలిజం ఆ తర్వాత అనేక ఆటుపోట్లకు గురైంది. చీలికలతో వేరుపడడం, అన్ని వైపులా నిర్బంధాలు పెరగడంతో విప్లవ ఉద్యమ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది.
Operation Kagar | మావోలకు మరణ శాసనం
దండకారాణ్యాన్ని అడ్డాగా చేసుకుని పోరాటం చేస్తున్న మావోయిస్టు(Maoists)లకు గడ్డు పరిస్థితులు దాపురించాయి. వరుస ఎన్కౌంటర్లలో ఎదురుదెబ్బలు తగులుతుండడం, భారీగా కేడర్ను కోల్పోతుండడం, రిక్రూట్మెంట్లు ఆగిపోవడంతో మావోలు కోలుకోలేక పోతున్నారు. అదే సమయంలో అందివచ్చిన అధునాతన టెక్నాలజీతో నక్సల్స్(Naxals) కదిలకలను భద్రతా బలగాలు సులువుగా గుర్తించగలుగుతున్నాయి. దండకారణ్యంలోకి చొచ్చుకెళ్లి మరీ మావోలను అంతమొందిస్తున్నాయి.
వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సల్స్ ను తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ప్రకటించారు. అందుకనుగుణంగానే ఆపరేషన్ కగార్ తో (Operation Kagar) మావోలపై కేంద్రం యుద్ధం చేస్తోంది. కొద్ది రోజులుగా చత్తీస్గఢ్లోని కర్రెగుట్టలను karregutta encounter అణువణువూ జల్లెడ పడుతోంది. ఎందరో వీరులు నేలకొరుగుతున్న తరుణంలో మావోలు ఇక తప్పనిసరై చర్చలకు సిద్ధమయ్యారు. శాంతి చర్చలకు సిద్ధమని, వెంటనే ఆపరేషన్ కగార్ operation kagar నిలిపి వేయాలని తాజాగా కేంద్రానికి లేఖ రాశారు. ఈనేపథ్యంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి..!