అక్షరటుడే, వెబ్డెస్క్ : Operation Bluestar | కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం (P Chidambaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ (Indira Gandi) హయాంలో చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్ తప్పుడు నిర్ణయమని ఆయన అన్నారు.
ఇందిరా గాంధీ హయాంలో పంజాబ్లో సిక్కులు పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయంలో ఖలిస్తానీ వేర్పాటువాదులు దాక్కున్న విషయం తెలిసిందే. బింద్రాన్‌వాలే నేతృత్వంలోని వేర్పాటువాద ఉద్యమాన్ని అణిచివేయడానికి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 1984 జూన్ 1 మరియు జూన్ 8 మధ్య ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించారు.
భారత సైన్యం స్వర్ణ దేవాలయంలోకి వెళ్లి వేర్పాటు వాదులను హతమార్చింది. దీనిపై శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో చిదంబరం మాట్లాడారు. స్వర్ణదేవాలయంలో (Golden Temple) దాగిన ఖలిస్తానీ వేర్పాటువాదులను బయటకు రప్పించే మార్గం ఉందన్నారు. ఆపరేషన్ బ్లూస్టార్ ఒక తప్పుడు నిర్ణయమని అంగీకరించారు.
Operation Bluestar | సమష్టి నిర్ణయం
ఆపరేషన్ బ్లూస్టార్ ఇందిరాగాంధీ ఒక్కరే తీసుకున్న నిర్ణయం కాదని చిదంబరం పేర్కొన్నారు. ఆర్మీ, పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగాలు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమని తెలిపారు. అయితే ఆ తప్పుడు నిర్ణయానికి ఇందిరాగాంధీ ప్రాణాన్నే మూల్యంగా చెల్లించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. తాము పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించడంతో సిక్కులు ఆమెపై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో ఇందిరా గాంధీ అంగరక్షకులే ఆమెను హత్య చేశారు.
అనంతరం దేశంలో సిక్కులపై అనేక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు మూడు వేల మంది సిక్కులు చనిపోయినట్లు సమాచారం. దీనిపై అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) స్పందిస్తూ.. పెద్ద చెట్టు కూలిపోతే భూమి కంపిస్తుంది అని వ్యాఖ్యానించడం గమనార్హం.