అక్షరటుడే, వెబ్‌డెస్క్: Konaseema District | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో అతి తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుసుమండ వద్ద ఉన్న ఓఎన్‌జీసీ (ONGC) పైపులైన్ నుండి గ్యాస్ లీక్ కావడంతో ఏర్పడిన బ్లో అవుట్ రెండో రోజు కూడా కొనసాగుతోంది.
భారీ మంటలు ఎగసిపడుతుండడంతో, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. సాధారణ స్థాయిలో నిలిపే ప్రయత్నాలు చేసినా, గ్యాస్ లీక్‌తో కలిపి క్రూడ్ ఆయిల్ (Crude Oil) కూడా బయటపడడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. మంటలు ఆకాశాన్ని తాకే స్థాయిలో ఎగిసిపడుతుండటంతో ఘటన స్థలంలో భద్రతా బలగాలను భారీగా ఏర్పాటుచేశారు.
Konaseema District | ఢిల్లీ నుంచి ప్రత్యేక నిపుణుల బృందం
మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఢిల్లీ నుంచి ప్రత్యేక నిపుణుల బృందం వస్తున్నట్లు. ఓఎన్‌జీసీ అధికారులు తెలిపారు. ‘వాటర్ అంబరిల్లా’ పద్ధతిని ఉపయోగిస్తూ, నాలుగు వైపుల నుంచి భారీగా నీటిని విరజిమ్మిస్తూ మంటలను నియంత్రిస్తారు. ఈ క్రమంలో గ్యాస్ లీక్ (Gas Leak) నియంత్రణకు అవసరమైన పైపులు, ఇతర సామాగ్రిని నరసాపురం, రాజమండ్రి నుంచి తెప్పిస్తున్నారు. మొత్తం ప్రక్రియ కొన్ని గంటలు పట్టవచ్చని అధికారులు పేర్కొన్నారు. భద్రత కారణాల వల్ల, ఘటన సమీపంలోని నాలుగు గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పొగ, గ్యాస్ చొచ్చుకెళ్తున్న కారణంగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులు, ఎటువంటి అగ్నిప్రమాదాలు (Fire Accidents) జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఉత్పత్తి బావి అకస్మాత్తుగా ఆగినప్పుడు వర్క్ ఓవర్ రిగ్ పనులు కొనసాగుతున్న సందర్భంలో, ఒక్కసారిగా భారీ ఎత్తున క్రూడ్‌తో కూడిన గ్యాస్ బయటకు వచ్చింది. దీనివల్ల బ్లో అవుట్ పరిస్థితి ఏర్పడిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కోనసీమ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా గ్యాస్ లీక్‌లు, బ్లో అవుట్‌లు తరచుగా చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చమురు, సహజ వాయు వెలికితీత పేరుతో ప్రాంతం “నిప్పుల కొలిమి”గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్‌జీసీ భద్రతా ప్రమాణాల అమలు సరిగా లేదని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, అధికారులు ప్రజలు భయపడవలసిన అవసరం లేదని, నిపుణుల బృందం రాగానే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని హామీ ఇచ్చారు. స్థానిక అధికారులు, ఓఎన్‌జీసీ సిబ్బంది ఘటన స్థలంలో పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అతి జాగ్రత్తతో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.