HomeUncategorizedBihar | నాగుపాముని కొరికి చంపిన ఏడాది బాలుడు.. త‌ర్వాత ఏమైందంటే..!

Bihar | నాగుపాముని కొరికి చంపిన ఏడాది బాలుడు.. త‌ర్వాత ఏమైందంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bihar | సాధార‌ణంగా పాము క‌నిపిస్తే మ‌నం ఆమ‌డ‌దూరం వెళ‌తాం. ఇక నాగుపాము లాంటిది క‌నిపిస్తే భ‌యంతో ప‌రుగు పెట్ట‌డం ఖాయం. అయితే ఓ ఏడాది బాలుడు ఏ మాత్రం భ‌యం లేకుండా పాముని కొరికి చంపేశాడు. ఇప్పుడు ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. బీహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లాలో (West Champaran) చోటు చేసుకున్న ఈ ఘటన అందిరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. గోవింద అనే ఏడాది వయసున్న చిన్నారి, తన చేతికి చుట్టుకున్న నాగుపామును (Cobra) తన పళ్లతో కొరికి చంపేశాడు. ఈ సంఘటన ప్రస్తుతం గ్రామంలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Bihar | ఎంత ధైర్యం..

బేతియా (Bethia) పట్టణ పరిధిలోని ఒక గ్రామంలో, గోవింద తల్లి ఇంటి వద్ద కట్టెలు సేకరిస్తుండగా, చిన్నారి ఇంటి ముందే ఆడుకుంటున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా ఒక నాగుపాము అక్కడకు వచ్చి చిన్నారి చేతికి చుట్టుకుంది. ప్రమాదాన్ని గ్రహించిన చిన్నారి భయపడకుండా తన పళ్లతో పామును రెండు, మూడు సార్లు బలంగా కొరకడంతో, అది అక్కడికక్కడే చనిపోయింది.ఈ దృశ్యం చూసిన తల్లి, అమ్మమ్మ భయంతో వ‌ణికిపోయారు. కొద్దిసేపటికే గోవింద స్పృహ కోల్పోవడంతో, తక్షణమే స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బేతియాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి (Government Medical College Hospital) తరలించారు.

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవింద ఆరోగ్యం నిలకడగా ఉంది. అతని శరీరంలోకి పాము విషం ప్రవేశించలేదని తెలిపారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత, పాము కొట్టిన దెబ్బలతో మాత్రమే గోవింద స్పృహ కోల్పోయి ఉండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గోవింద చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏడాది బాలుడు కనబరిచిన ధైర్యంపై నెటిజన్లు, స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలుడి ధైర్యానికి హ్యాట్సాప్​ అంటూ కామెంట్లు చేస్తున్నారు.