అక్షరటుడే, కామారెడ్డి: Bhiknoor | పొలంలో పనిచేస్తుండగా విద్యుత్‌షాక్ తగలడంతో ఓ కౌలు రైతు పొలంలోనే మృతి చెందాడు. ఈ ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి (Jangampally) శివారులో ఆదివారం చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం (Kamareddy mandal) నర్సన్నపల్లి గ్రామానికి చెందిన చిదుర రాజిరెడ్డి(45) తనకున్న వ్యవసాయ భూమితో పాటు జంగంపల్లి శివారులో ఉన్న ఆరెకరాల భూమిని కొన్నేళ్లుగా కౌలుకు సాగు చేస్తున్నాడు.
వ్యవసాయ భూమిలో సర్వీస్ వైర్లు కిందకు వేళాడుతున్నాయి. దీంతో ఆదివారం దుక్కి దున్నుతూ సరి చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. దాంతో ట్రాక్టర్‌పై సీటులోనే రాజిరెడ్డి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వ్యవసాయ భూమి వద్దకు చేరుకుని బోరున విలపించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.