అక్షరటుడే, వెబ్డెస్క్ : Mallikarjuna Kharge | వస్తు సేవల పన్ను(జీస్టీ) హేతుబద్ధీకరణ, రేటు తగ్గింపులపై కాంగ్రెస్ విభిన్నంగా స్పందించింది. మోదీ ప్రభుత్వం చెప్పిన ఒక దేశం.. ఒక పన్ను నినాదం ఇప్పుడు ఒక దేశం 9 పన్నులుగా మార్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) ఆరోపించారు.
కాంగ్రెస్ దశాబ్ద కాలంగా జీఎస్టీ(GST) సరళీకరణకు డిమాండ్ చేస్తోందని గుర్తుచేశారు. సంక్లిష్టమైన జీఎస్టీ విధానం సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థలు, చిరు వ్యాపారాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని ఖర్గే పేర్కొన్నారు. “దాదాపు ఒక దశాబ్ద కాలంగా కాంగ్రెస్ జీఎస్టీ సరళీకరణను డిమాండ్ చేస్తోంది. మోదీ ప్రభుత్వం “ఒక దేశం, ఒక పన్ను” ను “ఒక దేశం, 9 పన్నులు”గా మార్చింది” అని ఖర్గే Xలో విమర్శించారు.2014, 2019 మ్యానిఫెస్టోలలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) సరళమైన, హేతుబద్ధమైన పన్ను వ్యవస్థతో GST 2.0ని తెస్తామని, MSMEలు, చిన్న వ్యాపారాలను తీవ్రంగా ప్రభావితం చేసిన సంక్లిష్టమైన GST సమ్మతిని సరళీకృతం చేయాలని నిర్ణయించిందని తెలిపారు.
Mallikarjuna Kharge | నాడు వ్యతిరేకించి..
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) జీఎస్టీ బిల్లును తీసుకొచ్చినప్పుడు బీజేపీ వ్యతిరేకించిందని ఖర్గే గుర్తు చేశారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ(PM Modi) కూడా జీఎస్టీని తప్పుబట్టారన్నారు. అదే మోదీ ఇప్పుడు జీఎస్టీ పేరిట సామాన్యుల ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తూ తన ఘనతగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. “ఫిబ్రవరి 28, 2005న, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం లోక్‌సభలో జీఎస్‌టీని ప్రకటించింది. 2011లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ వ్యతిరేకించింది. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకించారు. నేడు అదే బీజేపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు చేస్తోంది. సామాన్యుల నుంచి అధిక పన్నులు వసూలు చేయడం గొప్ప విజయంగా చెప్పుకుంటోందని” ఖర్గే మండిపడ్డారు.
Mallikarjuna Kharge | బడాబాబులకే మేలు..
8 సంవత్సరాల ఆలస్యంగానైనా GSTపై మోడీ ప్రభుత్వం గాఢ నిద్ర నుంచి మేల్కొనడం మంచి విషయమన్నారు. మొత్తం GSTలో మూడింట రెండు వంతులు అంటే 64%, పేదలు మరియు మధ్యతరగతి ప్రజల జేబుల నుంచి వస్తుందని గుర్తు చేసిన ఖర్గే.. తాజా సరళీకరణలతో వారికి పెద్దగా ప్రయోజనం దక్కదన్నారు. కార్పొరేట్ పన్ను రేటు 30% నుంచి 22%కి తగ్గించబడినప్పటికీ, 3% GST మాత్రమే బిలియనీర్ల నుండి వసూలు చేయబడుతుందన్నారు.సంక్లిష్టమైన GST సమ్మతులను తొలగించాలని ఆయన పిలుపునిచ్చారు, అప్పుడే MSMEలు, చిన్న పరిశ్రమలు నిజంగా ప్రయోజనం పొందుతాయని పేర్కొన్నారు.