అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoists | మావోయిస్టులు(Maoists) మరో సంచలన ప్రకటన చేశారు. ఇటీవల కేంద్ర కమిటీ అధికారి ప్రతినిధి అభయ్ పేరిట విడుదలైన లేఖతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఆపరేషన్ కగార్(Operation Kagar) ఆపేస్తే.. తాము ఆయుధాలు వీడి లొంగిపోతామని ఇటీవల అభయ్ పేరిట లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై మావోయిస్టులు స్పందించారు. ఆ స్టేట్‌మెంట్‌తో తమకు సంబంధం లేదన్నారు. అయితే ఆ ప్రకటన అభయ్(Abhay) వ్యక్తిగతంగా పేర్కొన్నట్లు చెప్పారు. తాము శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఆయుధాలు వీడుతామనే ప్రకటన మాత్రం చేయలేదన్నారు. మార్చి నుంచి చర్చల కోసం ప్రతిపాదనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆపరేషన్ కగార్ ఆపేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
Maoists | అందుకే లొంగిపోతున్నారు
కీలక నేతలు ఉద్యమాన్ని వీడుతుండటంపై మావోలు స్పందించారు. ఇటీవల కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క లొంగిపోయిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆరోగ్య కారణాలతో లొంగిపోతున్నట్లు మావోయిస్టులు పేర్కొన్నారు. శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్థరహితమని మావోలు అన్నారు. ఈ మేరకు అభయ్ తీరును ఖండించారు. ఇలాంటి ప్రకటనలు చేసే ముందు పార్టీ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏకపక్షంగా ఆయన చేసిన ప్రకటన పార్టీకి నష్టం చేసేలా ఉందని పేర్కొన్నారు. పార్టీలో చర్చలు జరపకుండా.. ఆయుధాలు వీడుతామని తీవ్రమైన చర్యగా మావోయిస్టు పార్టీ పేర్కొంది.
Maoists | లేఖపై తీవ్ర చర్చ
మావోయిస్టు పార్టీ(Maoist Party) అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడులైన లేఖపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో పార్టీ స్పష్టత ఇచ్చింది. కొందరు ఇది నకిలీ లేఖ అని ఆరోపించారు. అయితే తాజాగా లేఖ అభయ్ విడుదల చేసినట్లు పార్టీ స్పష్టం చేసింది. అయితే ఆయన వ్యక్తిగత నిర్ణయమని పేర్కొంది. దీంతో మావోయిస్టుల్లో ఎవరికి వారు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇంత కీలక ప్రకటన సొంతంగా ఆయన ఎలా చేశారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ నిర్ణయం మేరకు ప్రకటన చేయాల్సిన అధికార ప్రతినిధి సొంతంగా లేఖ ఎలా విడుదల చేశారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మావోల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి అనడానికి ఇది నిదర్శనం అంటున్నారు.