అక్షరటుడే, వెబ్‌డెస్క్: Govt employees | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మహబూబ్‌నగర్ డీటీసీ కిషన్ నాయక్‌ను (Mahbubnagar DTC Kishan Naik) ఏసీబీ అరెస్ట్ చేయడం, అతడి వద్ద వందల కోట్ల ఆస్తులు పట్టుబడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కాగా.. కిషన్ నాయక్ అరెస్ట్ వ్యవహారం నిజామాబాద్ జిల్లాలోనూ (Nizamabad district) తీవ్ర చర్చకు దారి తీసింది.
నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని (Nizamabad bypass road) లహరి హోటల్ ఇంటర్నేషన్లో కిషన్ నాయక్ 50 శాతం వాటా కలిగి ఉండడం, ఇదే కాకుండా పది ఎకరాలకుపైగా కమర్షియల్ స్థలాలు కూడబెట్టడం.. ఇందులో ప్రముఖ బిల్డర్లు, రియల్టర్లు భాగస్వాములు కావడంతో సర్వత్రా చర్చనీయాంశం అయింది. కాగా.. కిషన్ నాయక్ తరహాలోనే జిల్లాలో పనిచేస్తున్న పలువురు అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తుండడం ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపింది. ఈ విషయమై ఏసీబీ సైతం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. సగటున రోజుకు ఒకటి నుంచి రెండు ట్రాప్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే తాజాగా మరింత దూకుడు పెంచిన అవినీతి నిరోధక శాఖ అధికారులు (Anti-Corruption Bureau officials) ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులుగా చలామణి అవుతున్న తిమింగలాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కిషన్ నాయక్‌ను ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేసి, రూ.వందల కోట్ల ఆస్తులను గుర్తించింది.
Govt employees | జిల్లాలో సైతం..
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కొందరు ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు ఒకవైపు విధుల్లో కొనసాగుతూ.. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. బడా బిల్డర్లుగా మారి ఏకంగా వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. కొందరైతే ఏకంగా తమ పేర్లను నేరుగా ఫర్మ్‌లలో నమోదు చేసుకోగా.. మరికొందరు తమ కుటుంబీకులు, బినామీలను తెరపై ఉంచుతున్నారు. తెరవెనుక నుంచి రియల్ ఎస్టేట్ దందా సాగిస్తున్నారు. ప్రస్తుతం బైపాస్ రోడ్డులో రియల్ ఎస్టేట్ దందా సాగిస్తున్న వారిలో తహశీల్దార్ స్థాయి అధికారి ఉన్నరన్నది బహిరంగ రహస్యమే. కానీ ఈ విషయమై జిల్లా స్థాయి అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.
అలాగే ఓ జీపీవో ఏకంగా ఓ స్టార్ హోటల్‌ను నిర్మిస్తున్నాడు. విద్యాశాఖలోని (education department) ప్రధాన సంఘానికి బాధ్యులుగా ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు అటు రియల్ ఎస్టేట్, ఇటు బిల్డర్లుగా మారిపోయారు. వైద్యారోగ్య శాఖలో పనిచేసే మరో ఉద్యోగి అన్ని రకాల దందాలను నడిపిస్తున్నాడు. విద్యుత్ శాఖలో పనిచేసే ఓ అధికారి సొంత శాఖలోని కాంట్రాక్ట్ పనులన్నీ తన బినామీల పేరిట చేజిక్కుంచుకొని చేపడుతున్నాడు. అటవీ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి సైతం రియల్ ఎస్టేట్ దందా, పైరవీలకు పరిమితమైనట్లు సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ శాఖల్లో కీలక హోదాల్లో ఉండి అటు ఉన్నతాధికారులతో చెట్టపట్టాలు వేసుకొని మరోవైపు వ్యాపారాలు మూడు పూలు ఆరు కాయలుగా సాగిస్తున్న వారు ఎందరోనని సర్వత్రా మొదలైంది.
Govt employees | సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా..
ప్రభుత్వ ఉద్యోగంలో పని చేసే వారు ఎవరైనా సర్వీస్ రూల్స్‌కు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అటెండర్ స్థాయి మొదలుకొని, జిల్లా స్థాయి అధికారి వరకు ఎవరైనా సర్వీస్ రూల్స్ పాటించడం తప్పనిసరి. ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ.. ఆర్థిక పరమైన వ్యవహారాలు, లావాదేవీలు, వ్యాపారాలు నిర్వహించడం సర్వీస్ రూల్స్‌కు విరుద్ధం. కానీ ఇవేమీ లెక్క చేయకుండా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు బహిరంగంగానే తమ వ్యాపార సామాజ్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎట్టకేటలకు ఏసీబీ ఎంట్రీతో ఇలాంటి అధికారులు, ఉద్యోగుల తీరు మారుతుందో లేదో వేచి చూడాలి.