అక్షరటుడే, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్.. ఏ పని చేసిన చాలా కసిగా చేస్తాడు. ఎన్ని అపజయాలు పలకరించినా ఏ మాత్రం అదరడు, బెదరడు. సినిమాలలో అయిన, రాజకీయాలలో అయిన పవన్ పంథా అలానే ఉంటుంది. ఓటమి నేర్పిన పాఠంతో గెలుపు బావుటా ఎగరేయడం పవన్‌కి ఉన్న అలవాటు. చివరిగా హరిహర వీరమల్లు చిత్రంతో దారుణమైన పరాజయం చవి చూసిన పవన్ కళ్యాణ్ తాజాగా ఓజీతో పలకరించాడు. ఈ చిత్రం ఎలా ఉంది, సినిమా హిట్ అయినట్టేనా అనేది చూద్దాం.
OG Movie review | కథ ఏమిటి?
1993లో ముంబై పోర్ట్ పై ఆధిపత్యం కోసం దాదాగా ఎదిగిన సత్య దాదా (ప్రకాశ్ రాజ్) కి అండగా నిలిచిన గంభీర (పవన్ కళ్యాణ్), ఒక కారణంతో అతనికి దూరమవుతాడు. ఆ తర్వాత ఆ పోర్టుపై అనేక శక్తులు కన్నేసి, గంభీరకి శత్రువులెందరో అవుతారు. ఈ క్రమంలో అర్జున్ (అర్జున్ దాస్) , ఓమి/ఓంకార్ వర్ధమాన్ (ఇమ్రాన్ హష్మీ) లాంటి క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయి. గంభీర గతం ఏంటి? అతను ఎందుకు సమురాయ్ లాంటి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయ్యాడు? అనే విషయాలు కథలో టర్నింగ్ పాయింట్స్. అయితే ఓమి ఆర్డియక్ కంటైనర్స్ సత్యదాదా దగ్గరకి వచ్చాక ఎక్కడికి వెళ్లాయి, అసలు గంభీర ఎవరు, ఆయన గతం ఏంటో తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.
OG Movie review | నటీనటుల పర్ఫార్మెన్స్
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గురించి ప్రకాశ్ రాజ్ నోటితో మంచి ఎలివేషన్స్ ఇప్పించి అదరగొట్టాడు సుజీత్. రాజకీయ పరంగా పవన్‌పై తెగ విమర్శలు చేస్తుంటాడు ప్రకాశ్ రాజ్. కానీ సినిమాలో మాత్రం ప్రకాశ్ రాజ్ నోట నుంచి వచ్చే హైఓల్టేజ్ ఎలివేషన్ సీన్లు మాములుగా ఉండవు. పవన్, ప్రకాశ్ రాజ్ కాంబినేషన్ సీన్లు ఎంతో ఎమోషనల్‌గా అనిపిస్తాయి. ఇక ప్రియాంక మోహన్ కన్మణి పాత్రలో అదరగొట్టింది. పవన్‌కి పెయిర్‌గా, భర్తని కంటికి రెప్పలా కాపాడుకునే పాత్రలో బాగా నటించింది. ప్రతినాయకుడిగా ఇమ్రాన్ హష్మీ.. గంభీరుడితో పోటీ ఇచ్చాడు. అతనిని కూడా సుజీత్ చాలా స్టైలిష్‌గా చూపించారు. శ్రియారెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, సుదేవ్ నాయర్, తేజ్ సప్రూ, సత్యప్రకాష్, అభిమన్యు సింగ్, ‘కిక్’ శ్యామ్, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవీంద్రన్, అజయ్ ఘోష్, జీవా, ‘యానిమల్’ ఫేమ్ ఉపేంద్ర లిమయే, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్, సమ్మెట గాంధీ ఇలా అందరు తమ తమ పాత్రలకి న్యాయం చేశారు. సుహాస్.. చాలా చిన్న రోల్లో కనిపించాడు.
OG Movie review | టెక్నికల్ పర్ఫార్మెన్స్:
ఇటీవల జరిగిన ఈవెంట్లో పవన్ కళ్యాణ్.. ఓజీకి మెయిన్ పిల్లర్స్ థమన్, సుజీత్ అని చెప్పడం చూశాం. సినిమా చూశాక కూడా మనకు అదే ఫీల్ కలుగుతుంది. థమన్ తన మ్యూజిక్ సెన్స్‌తో సినిమా స్థాయిని పెంచేశాడు. ఇన్నాళ్లు బాలయ్య సినిమాలకే బాగా కొడతాడనే పేరు ఉండేది. ఇప్పుడు ఓజీకి ఇచ్చిన మ్యూజిక్ చూస్తే మెచ్చుకోకుండా ఉండలేం. పవన్ కళ్యాణ్‌లోని కొత్త రకం స్వాగ్, స్టైల్‌ని దర్శకుడు చూపించాలనుకోగా, దానిని రవికె చంద్రన్, మనోజ్ పరమహంస తమ కెమెరా పనితనంతో అద్భుతంగా చూపించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్‌తో పాటు.. ఏ విజయ్, పీటర్ హెయిన్స్, స్టంట్స్ శివల యాక్షన్ సీన్స్ సినిమాకి హైలైట్. హై టెక్నికల్ వాల్యూస్ అందించడంలో నిర్మాత దానయ్య ఖర్చుకి ఏ మాత్రం వెనకడాలేదు.
OG Movie review | ప్లస్ పాయింట్స్
పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్
స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్
ఇమ్రాన్ హష్మీ – అర్జున్ దాస్
టెక్నికల్ వర్క్
రవికే చంద్రన్ – మనోజ్ పరమహంస విజువల్స్
థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
ఎడిటింగ్
OG Movie review | మైనస్ పాయింట్స్
కథలో కొత్తదనం లేకపోవడం.
రొటీన్ రివెంజ్ టెంప్లేట్‌తోనే సాగడం.
పెద్దగా వావ్ అనిపించే ట్విస్ట్‌లు లేకపోవడం.
సెకండాఫ్‌లో ఎక్కడో ఏదో మిస్సింగ్ ఫీల్.
OG Movie review | విశ్లేషణ:
ఈ ఏడాది ఒక ఫ్లాప్ తర్వాత కూడా ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ సినిమా “ఓజి” చివరికి థియేటర్స్ లో ప్రేక్షకులను పలకరించింది. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామా భారీ అంచనాలతో రిలీజ్ అవ్వగా, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి బాగా న్యాయం చేసింది. సుజీత్ డైరెక్షన్ లో పవన్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ అవతారంలో అదరగొట్టాడు. థమన్ సంగీతం, కెమెరా వర్క్ సినిమాకి అదనపు హైప్ ఇస్తాయి. కానీ కథనం లో కొత్తదనం, బలమైన ఘర్షణలు లేకపోవడం వల్ల సాధారణ ప్రేక్షకులకు ఇది అంత ఎంగేజింగ్‌గా అనిపించదు, కానీ ఫ్యాన్స్‌కి మాత్రం మాస్ ట్రీట్‌గా మిగిలిపోతుంది. సుజీత్ దర్శకుడిగా ఈ సినిమాతో మరో లెవల్‌కి వెళ్లిపోయాడు. పవన్ కల్యాణ్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి మార్కులు కొట్టాడు.
రేటింగ్: 3/5
నటీనటులు : పవన్ కళ్యాణ్,ప్రకాశ్ రాజ్,ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్
దర్శకుడు:సుజీత్
వ్యవధి:2 Hrs 34 Min
సంగీతం : థమన్
నిర్మాత : డీవివి దానయ్య, కళ్యాణ్ దాసరి
సినిమాటోగ్రాఫర్ : రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
ఎడిటర్ : నవీన్ నూలి