అక్షరటుడే, కామారెడ్డి : Oil palm farming | అత్యధిక లాభాలు తెచ్చే ఆయిల్ పామ్ ఫార్మింగ్‌కు రైతులు ముందుకు రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageswara Rao) సూచించారు. పాల్వంచ మండల కేంద్రంలో శుక్రవారం హిందూస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పాల్వంచ మర్రి శివారులో మొక్కలు నాటారు.
Oil palm farming | కామారెడ్డితో అనుబంధం ఉంది..
అనంతరం ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాతో (Kamareddy District) తనకు చాలా అనుబంధం ఉందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రొడక్ట్స్ తయారు చేసే పెద్ద కంపెనీ హిందూస్తాన్ యూనిలివర్ కంపెనీ (Hindustan Unilever Company) అని అందుకే ఈ జిల్లాలో ఆయిల్ పామ్ ఫార్మింగ్ బాధ్యత ఆ కంపెనీకి అప్పగించామన్నారు. రైతులు సంతోషంగా ఉండాలని, ఆ బాధ్యత కంపెనీ తీసుకోవాలని, రైతులకు సూచనలివ్వాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఆయిల్ పామ్ ఫార్మింగ్‌లో ఇతర పంటలు కూడా వేసుకోవచ్చని మంత్రి తెలిపారు. రైతాంగానికి మేలు జరగాలని, ఈ పంటను వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నామని తెలిపారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రిని.. మంత్రి ఉత్తమ్, తాను కలిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి దొడ్డు బియ్యం సేకరించలేమని చెప్పారని తెలిపారు.
Oil palm farming | ఒక్కో జిల్లాలో ఒక్కో కంపెనీకి..
ఆయిల్ పామ్ సాగు బాధ్యత ఒక్కో జిల్లాలో ఒక్కొక్క కంపెనీకి ఇచ్చామని మంత్రి తెలిపారు. అన్ని జిల్లాల్లో ఫ్యాక్టరీల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. పంట కోసిన 24 గంటల్లో పంటను తరలిస్తారన్నారు. ఆ బాధ్యత కంపెనీ వారిదేనని తెలిపారు. రూ.300 కోట్లతో సిద్దిపేటలో (Siddipet) ఫ్యాక్టరీ నిర్మించామని, ఈనెల 24 సీఎంతో ప్రారంభం చేయబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో టన్నుకు రూ.25వేల ధర వచ్చేలా ప్రభుత్వం చూస్తుందని తెలిపారు. హైదరాబాద్‌కు దగ్గర ఉండడంతో కామారెడ్డి భవిష్యత్‌లో ఆయిల్ పామ్ సాగుకు సెంటర్ కాబోతోందని తెలిపారు. అత్యధిక లాభాలు ఇచ్చే ఆయిల్ ఫార్మింగ్ చేయడానికి రైతులు నిర్భయంగా ముందుకు రావాలని సూచించారు. రాష్ట్రం మొత్తం పచ్చబడాలని, రైతులు బాగుండాలని సీఎం ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి రైతులకు అందుబాటులో ఉండి అనుమానాలు నివృత్తి చేయాలని కలెక్టర్ కు సూచించారు.
ఆయిల్ పామ్ సాగుతో రైతుకు లాభాలు: పోచారం
ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాలు ఉన్నాయని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) అన్నారు. పంట పండించే స్వేచ్ఛ రైతులకు ఉందని, ఏ పంట వేయాలో రైతులపై ఒత్తిడి ఎవరు చేయలేరన్నారు. రైతులను అప్పుల బారి నుంచి బయటపడేందుకు ఫలానా పంట వేయాలని చెప్పడం తమ బాధ్యత అని తెలిపారు. గతంలో ఆయిల్ పామ్ సాగులో ఖమ్మం జిల్లా (Khammam District) ముందంజలో ఉండేదన్నారు. మంత్రి తుమ్మల ప్రోత్సాహంతో ఖమ్మం జిల్లాలోని అశ్వరావు పేటలో 60 టన్నుల కెపాసిటీతో రూ.90 కోట్లతో మంత్రి తుమ్మల ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారన్నారు. దాంతో 20వేల ఎకరాల్లో ఉన్న ఆయిల్ పామ్ నేడు లక్షా 50 వేల ఎకరాలకు వెళ్లిందన్నారు. అశ్వరావు పేటలో వచ్చే ఆయిల్ రికవరీ తర్వాత కేంద్ర ప్రభుత్వం (Central Government) రేట్ ఫిక్స్ చేసిందని పేర్కొన్నారు. ఈ పంట వేయడం ద్వారా ఖర్చులు పోగా ఎకరానికి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల ఆదాయం ఉంటుందన్నారు. ఆయిల్ పామ్ సాగుతో ఎలాంటి ఇబ్బంది లేదని, లాభంతో కూడిన పంటపై రైతులు ఆలోచించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ యాస్మిన్ భాషా, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ మధుమోహన్, జిల్లా హార్టికల్చర్ అధికారిణి జ్యోతి, హిందూస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.