Homeబిజినెస్​Gold | అమ్మో అంత బంగారమే..! భారతీయుల వద్దనున్న పసిడి విలువ అన్ని లక్షల కోట్ల...

Gold | అమ్మో అంత బంగారమే..! భారతీయుల వద్దనున్న పసిడి విలువ అన్ని లక్షల కోట్ల రూపాయలా..!

Gold | ప్రస్తుతం భారతీయుల(Indians) వద్దనున్న బంగారం విలువ తెలిస్తే షాక్‌ అవుతారు. రూ. 337 లక్షల కోట్ల విలువచేసే 34,600 టన్నుల బంగారం ప్రజల వద్ద ఉన్నట్లు అంచనా. ఇది దేశ జీడీపీలో 89 శాతం కావడం గమనార్హం.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold | భారతీయులకు బంగారం అంటే ఎంతో ప్రీతి. ఏదో సందర్భంలో స్థోమత మేరకు ఎంతోకొంత బంగారం కొనేస్తుంటారు. మహిళలునచ్చిన ఆభరణాలు చేయించుకుని ధరిస్తుంటారు. శుభకార్యాలలో శక్తిమేరకు దగ్గరి బంధువులకు కానుకగా ఇస్తుంటారు.

ఇలా తెలియకుండానే ప్రజల వద్ద చాలా బంగారం ఉంది. ఒకప్పుడు ఆభరణంగానే ఉపయోగించే గోల్డ్‌.. ఇప్పుడు పెట్టుబడి (Investment) సాధనంగానూ మారిపోయింది. బంగారం ధర రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఏడాదిన్నరగా అడ్డన్నదే లేదన్నట్లుగా పెరుగుతూ ఆకాశానికి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర (Gold Rate) రూ. 1.25 లక్షలు దాటింది. ఈ ఏడాదిలోనే అరవై శాతానికిపైగా ధర పెరగడం గమనార్హం. దీంతో కొంత ఫిజికల్‌ బంగారం కొనుగోళ్లు మందగించినా.. ఇప్పటికే భారతీయుల వద్ద భారీగా నిల్వలున్నాయి.

Gold | త్వరలోనే జీడీపీని దాటే అవకాశం..

భారత ప్రజల వద్ద 34,600 టన్నుల బంగారం ఉన్నట్లు ఇటీవల మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. దీని విలువ రూ. 337 లక్షల కోట్లు. ఇది మనదేశ జీడీపీ(GDP)లో ఏకంగా 89 శాతంగా ఉంటుందని మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక పేర్కొంది. ధర (Gold Price) ఇలాగే పెరుగుతూ పోతే త్వరలోనే ప్రజల వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ మన జీడీపీని దాటే అవకాశాలున్నాయి.

Gold | ఫిజికల్‌ గోల్డ్‌తో పాటు ఈటీఎఫ్‌ల రూపంలోనూ..

సాధారణంగా ప్రజలు బంగారాన్ని ఫిజికల్‌గా కొనుగోలు చేస్తుంటారు. దానిని ఆభరణాలకోసం వినియోగిస్తారు. అలాగే శుభకార్యాలలో దగ్గరి బంధువులకు కట్నకానుకలుగా ఇవ్వడం కోసం కూడా ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకుంటుంటారు. ప్రస్తుతం గోల్డ్‌ను ఫిజికల్‌గానే కాకుండా డిజిటల్‌ రూపంలోనూ కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడి పెట్టాలనుకునేవారు గోల్డ్‌ ఈటీఎఫ్‌ (ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌) రూపంలో కొంటున్నారు. బంగారం ధర భారీగా పెరుగుతుండడంతో ఈటీఎఫ్‌(ETF)లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ ఇన్‌ఫ్లోలు దీనిని రుజువు చేస్తున్నాయి. ఆగస్టులో గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో రూ. 2,859 కోట్ల ఇన్‌ఫ్లోలు ఉండగా.. ఇది సెప్టెంబర్‌ నాటికి ఏకంగా మూడు రెట్ల వరకు పెరిగి రూ. 8,363 కోట్లకు చేరడం గమనార్హం.

Gold | ప్రభుత్వాలు సైతం..

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌(Russia Ukraine War) తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఈ యుద్ధం ప్రారంభమయ్యాక వివిధ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఆ దేశానికి సంబంధించిన నిధులను ఫ్రీజ్‌ చేశాయి. దీంతో చాలా దేశాలు అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా టారిఫ్‌లు, ఫెడ్‌ నిర్ణయాలతో ఒక్క అమెరికన్‌ డాలర్లలోనే ఎక్కువ ఫారెక్స్‌ నిల్వలు ఉంచుకుంటే ప్రమాదమని గ్రహించిన దేశాలు.. ఇతర దేశాల కరెన్సీలతోపాటు బంగారం కొనుగోళ్లపై దృష్టి సారించాయి. ఇందులో చైనా, భారత్‌(Bharath)లు ముందున్నాయి. ప్రపంచ బంగారం డిమాండ్‌లో చైనా(China) 28 శాతం కొనుగోళ్లతో అగ్రస్థానంలో ఉండగా.. 26 శాతం కొనుగోళ్లతో భారత్‌ రెండో స్థానంలో ఉంది. సెంట్రల్‌ బ్యాంక్‌లు దూకుడుగా పుత్తడిని కొనుగోలు చేస్తుండడం వల్లే ధరలు ఇలా భారీగా పెరుగుతున్నాయి.