అక్షరటుడే, కమ్మర్పల్లి: Kammarpally | ఇసుక అక్రమ రవాణాను (illegal sand transportation_ అధికారులు అడ్డుకోగా.. వారిని తప్పించుకుని వెళ్తూ ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటన కమ్మర్పల్లి మండలంలో (Kammarpally mandal) సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హాసాకొత్తూరు – కమ్మర్పల్లి రహదారిలో (Hasakotturu-Kammarpally road) ట్రాక్టర్‌తో ఓ వ్యక్తి ఇసుకను తరలిస్తున్నాడు.
అయితే విధుల్లో భాగంగా హాసాకొత్తూర్ వీఆర్ఏ ఈ ట్రాక్టర్‌ను వెంబడించి ఆపి ఎక్కడి నుంచి ఇసుకను తీసుకొస్తున్నావని డ్రైవర్ సాయికుమార్‌ను ప్రశ్నించారు. తాను భీమ్‌గల్ మండలంలోని కుప్కాల్ గ్రామంలోని (Kupkal village) ఒర్రె నుంచి ఇసుకను తెస్తున్నానని డ్రైవర్ పేర్కొన్నాడు. అయితే ఇలా అక్రమంగా ఇసుకను తీసుకురావడం చట్టవిరుద్దమని పేర్కొంటూ వీఆర్వో ఆర్ఐ శరత్‌కు సమాచారం అందించాడు.
ఆర్ఐ వెంటనే అక్కడికి చేరుకుని ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయగా ట్రాక్టర్ డ్రైవర్ వారిని తప్పించి వేగంగా ముందుకు వెళ్లాడు. అయితే కొద్దిదూరంలో అదుపుతప్పిన ట్రాక్టర్ బోల్తా పడింది. డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్టర్ యజమాని వేముల భాస్కర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌రెడ్డి పేర్కొన్నారు.
