అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | తీరం దాటిన మొంథా తుపాన్ తెలంగాణ వైపు దూసుకు వస్తోంది. ఇప్పటికే దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మొంథా తుపాన్ (Cyclone Montha)పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తుపాన్ ప్రభావంతో మధ్య తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో వాన దంచికొడుతోంది. దీంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy)అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలపై తుపాన్ ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. లోతట్టు ప్రాంతవాసులను తరలించాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
CM Revanth Reddy | రైతులు జాగ్రత్త..
వర్షాల నేపథ్యంలో వరి కోతల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రైతులకు సూచించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువుల దగ్గర ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలన్నారు. కాజ్‌వేలపై రాకపోకలను నిషేధించాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో SDRF, NDRF బృందాలతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్లకు (Collectors) సూచించారు.
తుపాన్ ప్రభావంతో వర్షపు నీరు నిలువ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని చెప్పారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

