అక్షరటుడే, వెబ్డెస్క్ : Sigachi Factory | సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పాశమైలారంలో గల సిగాచి పరిశ్రమ(Sigachi Factory)లో ఇటీవల పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 44 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే 8 మంది కార్మికుల ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ క్రమంలో బుధవారం అధికారులు కీలక ప్రటన చేశారు. 8 మంది ఆచూకీ లభించడం అసాధ్యమని పేర్కొన్నారు.
Sigachi Factory | ఇంటికి వెళ్లిపోవాలని సూచన
వారం రోజుల క్రితం సిగాచి పరిశ్రమలో పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాదంలో మొత్తం ఇప్పటి వరకు 44 మంది చనిపోయారు. 16 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే 8 మంది కార్మికుల ఆచూకీ లభిచంలేదు. రాహుల్, శివాజి, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ప్రమాదంలో కాలి బూడిదై ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఫ్యాక్టరీలో 100కిపైగా శాంపిల్స్ సేకరించినా వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో వీరు కాలిబూడిదై ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్(Additional Collector Chandrashekhar) సమాచారం ఇచ్చారు. ఆ ఎనిమిది మంది కార్మికుల కుటుంబ సభ్యులు ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. మూడు నెలల తర్వాత రావాలని సూచించారు.
Sigachi Factory | కొనసాగుతున్న విచారణ
సిగాచి పేలుడుకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కంపెనీలో కొత్త పరికరాలు కొనుగోలు చేయకపోవడంతో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది.
ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడంతో పాటు భవిష్యత్లో పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు నిపుణుల కమిటీ పరిశ్రమను పరిశీలించి వివరాలు సేకరించింది. మరోవైపు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు సైతం మంగళవారం పరిశ్రమను సందర్శించారు. సేఫ్టీకి సంబంధించి పరిశ్రమలో ప్రమాణాలపై ఆరా తీశారు. అనంతరం పరిశ్రమ యాజమాన్యాన్ని అధికారులు ప్రశ్నించారు. ఈ మేరకు నివేదిక సిద్ధం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నారు.