అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమానం ప్రమాదం దర్యాప్తులో అధికారులు కీలక పురోగతి సాధించారు. జూన్ 12 అహ్మదాబాద్ నుంచి లండన్(London) వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా మృతి చెందారు. ఇందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు. అయితే ప్రమాద కారణాలు తెలుసుకోవడానికి విమానంలోని బ్లాక్ బాక్స్(Black Box) కీలకంగా మారింది.
Ahmedabad Plane Crash | డేటా విశ్లేషణలో నిపుణులు
అధికారులు ప్రమాద స్థలంలో జూన్ 13న బ్లాక్ బాక్స్, ఫ్లైట్ డిజిటల్ డేటా రికార్డర్(Flight Digital Data Recorder)ను స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్స్ నుంచి డేటాను తాజాగా డౌన్లోడ్ చేశారు. దానిని విశ్లేషిస్తే ప్రమాద కారణాలు తెలిసే అవకాశం ఉంది. దీంతో ఢిల్లీలోని ల్యాబ్(Delhi Lab)లో డేటాను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు పౌర విమానయాన శాఖ గురువార ఒక ప్రకటన విడుదల చేసింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు ప్రారంభించినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. దీనికోసం జూన్ 13న ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ బృందం కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు(CVR), ఫ్లైట్ డేటా రికార్డర్ల(FDR)ను స్వాధీనం చేసుకుంది. జూన్ 24న బ్లాక్ బాక్స్‌లను IAF విమానం ద్వారా అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. తాజాగా దాని నుంచి డేటాను డౌన్లోడ్ చేశారు. ముందుగా బ్లాక్ బాక్స్ నుంచి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్(Crash protection module) సురక్షితంగా రికవరీ చేశారు. మెమరీ మాడ్యూల్ కూడా విజయవంతంగా యాక్సెస్ చేశారు. ఆ డేటాను ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు.