అక్షరటుడే, వెబ్‌డెస్క్: MP Eatala Rajendar | రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతుందని ఎంపీ ఈటల రాజేందర్ (MP Eatala Rajendar) అన్నారు. వారికి అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా (Medchal Malkajgiri district) పోచారం పరిధిలో ఏకశిల నగర్ ఉంది. అక్కడ కొన్ని రోజులుగా భూ వివాదం నడుస్తోంది. ఆ స్థలంలో పేదలు నివాసం ఉంటున్నారు. అయితే ఆ భూమి తమదేనని కొందరు వాదిస్తున్నారు. శనివారం కొందరు వచ్చి ఆ భూమిలో నుంచి ఖాళీ చేయాలని పేదలపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఏకశిలా నగర్లో ఆదివారం ఎంపీ ఈటల పర్యటించారు. బాధితులను పరామర్శించారు.
MP Eatala Rajendar | 40 ఏళ్ల నాటి కల
ఎంపీ మాట్లాడుతూ.. సుమారు 40 ఏళ్ల క్రితం సామాన్య ప్రజలు, రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఏకశిల నగర్లో స్థలాలు కొనుగోలు చేశారన్నారు. 146 ఎకరాల్లో 2086 ప్లాట్లు ఉన్నాయని, అవి 50, 100 గజాల స్థలాలు అన్నారు. ప్రస్తుతం ఆ స్థలాల విలువ పెరగగానే, భూ రాబందుల కళ్లు పడ్డాయని ఈటల ఆరోపించారు. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని, అప్పటి అధికారులతో కుమ్మక్కై వెంకటేశ్వర్లు అనే వ్యక్తి 47 ఎకరాలను తన పట్టా కింద మార్చుకున్నారని ఆరోపించారు.
MP Eatala Rajendar | గూండాలు భయపెడుతున్నారు..
గతేడాది తాను వచ్చి డీజీపీ, కలెక్టర్‌తో మాట్లాడినట్లు ఎంపీ తెలిపారు. అప్పుడు సమస్య పరిష్కారం అయిందని భావించినట్లు చెప్పారు. కానీ వెంకటేశ్వర్లు తాజాగా గూండాలతో వచ్చి ఆడబిడ్డలను భయపెడుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ వ్యవసాయ భూమి లేదని, ఇది ఏకశిల నగర్ ప్లాట్లని తెలిసినా ఆ గుండాల వెనుక సర్వేయర్ ఏడీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఆయన మీద ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసులు గూండాలకు సపోర్ట్ చేయకుండా వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. అధికారులు స్పందించి వెంకటేష్ మీద హత్యాయత్నం కింద కేసు పెట్టి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.