అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం లేదు. గ్రామీణ స్థాయి అధికారుల నుంచి కీలక స్థానాల్లో ఉన్న వారిలో సైతం పలువురు లంచాలకు మరిగారు. తాజాగా ఓ అధికారి ఏకంగా రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ దొరికాడు.
ముంబైలోని సహార్ ఎయిర్ కార్గో (Mumbai Sahar Air Cargo)లో విధులు నిర్వహిస్తున్న కస్టమ్స్ సూపరింటెండెంట్‌ను సీబీఐ అరెస్టు చేసింది. కార్గోలో సరుకుల క్లియరెన్స్‌ను సులభతరం చేయడానికి కస్టమ్స్ హౌస్ ఏజెంట్ (సీహెచ్‌ఏ) సంస్థ నుంచి సదరు అధికారి రూ. 10.20 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. ఆ డబ్బులను తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు (CBI Officers) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
CBI Trap | లంచం ఇవ్వకపోతే బెదిరింపులు
ఎయిర్ కార్గోలో సరుకుల క్లియరెన్స్ సజావుగా సాగేందుకు సదరు అధికారి కిలోకు రూ.10 చొప్పున లంచం డిమాండ్ చేస్తున్నట్లు సీబీఐకి ఫిర్యాదు అందింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు ప్రకారం లంచం ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ, నిందితుడు లంచం డిమాండ్ చేస్తూనే ఉన్నాడు. అంతేగాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు. లంచం ఇవ్వలేదని సరుకులను నిలిపి వేశాడు.
సీబీఐ అధికారులు జులై 25, ఆగస్టు 1న తనిఖీలు (Raids) చేపట్టారు. నిందితుడు గతంలో క్లియర్ చేసిన సరుకుల కోసం రూ.ఆరు లక్షలు డిమాండ్ చేశాడు. ఇందులో రూ.తన సీనియర్ అధికారుల (Senior Officials)కు రూ.5.8 లక్షలు చెల్లించాలని చెప్పాడు. ప్రస్తుతం పట్టుకున్న సామగ్రిని రిలీజ్ చేయడానికి రూ.10 లక్షలు అడిగాడు. భవిష్యత్‌లో సరుకులను సజావుగా క్లియర్ చేయడానికి కిలోకు రూ.10 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో సీబీఐ అధికారులు వల పన్ని నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు. రూ.10.20 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.