అక్షరటుడే, వెబ్డెస్క్ : Wine Shops | రాష్ట్రం కొత్త మద్యం దుకాణాల (Liquor Shops) కేటాయింపు కోసం డ్రా నిర్వహించడానికి అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఈ నెల 27న అధికారులు లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల లైసెన్స్దారులను ఎంపిక చేయనున్నారు.
రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటు కోసం గత నెల 26 నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నెల 18తో గడువు ముగిసింది. అయితే ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ప్రభుత్వం గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది. దీనిపై కొందరు హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్పై శనివారం హైకోర్టు విచారణ చేపట్టింది. గడువు పెంచడంతో 5 వేల దరఖాస్తులు అదనంగా వచ్చాయని పిటిషనర్లు వాదించారు.
Wine Shops | విధానపర నిర్ణయం
మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పెంచడం ప్రభుత్వ విధానపర నిర్ణయమని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదించారు. గడువు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ వాదనలతో ఏకీభవించింది. మద్యం దుకాణాల డ్రా నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 27న సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్లు ఆయా జిల్లాల్లో డ్రా తీయనున్నారు. కాగా రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.2,860 కోట్ల ఆదాయం వచ్చింది. డ్రా తీయడానికి హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఎక్సైజ్ అధికారులు (Excise officers) ఏర్పాట్లు చేస్తున్నారు.
