అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nursing Officer Posts | తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB)నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం తాత్కాలిక మెరిట్ జాబితాను బుధవారం విడుదల చేసింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ (Health Department)లో 2,322 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల కోసం గతంలో పరీక్ష నిర్వహించారు.
ఈ పోస్టుల కోసం మొదటి తాత్కాలిక మెరిట్ జాబితాను తాజాగా అధికారులు విడుదల చేశారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test)కి హాజరైన మొత్తం 40,423 మంది అభ్యర్థుల పూర్తి వివరాలను బోర్డు తన అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ప్రతి అభ్యర్థి సాధించిన మార్కులతో సహా, నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకతను నిర్ధారించడానికి MHSRB ప్రతి దశలోనూ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానిస్తోంది.
Nursing Officer Posts | 27 వరకు గడువు
మెరిట్ లిస్ట్‌పై అభ్యంతరాలు తెలపడానికి ఈ నెల 27 వరకు గడువు ఉంది. నేటి నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు బోర్డు వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా అభ్యర్థులు తమ అభ్యంతరాలను సమర్పించవచ్చు. అందిన అన్ని అభ్యంతరాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రెండో తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేస్తుంది. అనంతరం అభ్యర్థులను మెరిట్ ఆధారంగా 1:1.5 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ (Certificate Verification) కోసం పిలుస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత, తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారు. ఇటీవల MHSRB 1,260 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఎంపికైన ల్యాబ్ టెక్నీషియన్ల (Lab Technicians)తో పాటు 2,322 మంది నర్సింగ్ ఆఫీసర్లు కూడా జనవరిలో తమ విధుల్లో చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.