అక్షరటుడే, వెబ్డెస్క్: School Fee | ప్రస్తుతం చదువు బాగా ఖరీదు అయిపోయింది. ప్రైవేట్ పాఠశాలలు(Private Schools) ఫీజుల పేరిట తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. చాలా బడుల్లో కనీస వసతులు లేకున్నా.. రూ. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫామ్స్ పేరిట సైతం దోచుకుంటున్నారు. పలు ప్రైవేట్ పాఠశాలలో రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండడం గమనార్హం. హైదరాబాద్(Hyderabad)లోని ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీ ఫీజురూ.2.5 లక్షలు(Nursery Fees Rs. 2.5 Lakhs) నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫీజు వివరాలను ఓ తండ్రి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్గా మారింది.
School Fee | పర్యవేక్షణ లేక..
ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులపై పర్యవేక్షణ చేయడం లేదు. దీంతో పాఠశాల యజమాన్యాలు (School Owners) ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నాయి. నర్సరీకి రూ.2.51 లక్షలు, ఎల్కేజీ, యూకేజీలకు రూ.2.72 లక్షల ఫీజును సదరు పాఠశాలలో వసూలు చేస్తున్నారు. అయితే నర్సరీ నుంచి యూకేజీ వరకు ఏబీసీడీలు, నంబర్స్, తెలుగు వర్ణమాల మాత్రమే నేర్పుతారు. ఏబీసీడీలు నేర్పడానికి రూ.2.51 లక్షల ఫీజు కట్టాలా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నర్సరీ ఫీజును లెక్కేస్తే నెలకు రూ.21 వేలు వస్తుంది. చాలా మంది మధ్యతరగతి వారి జీతం కూడా అంత ఉండటం లేదు. దీంతో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
School Fee | తల్లిదండ్రుల తీరుతో..
ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులు బాగా ఫీజు ఉన్న బడిలో చదివిస్తే గొప్ప అని ఫీల్ అవుతున్నారు. ఉన్నత వర్గాల వారు పెద్ద పెద్ద బడుల్లో చదివిస్తుండటంతో ఎగువ మధ్య తరగతి వారు సైతం అప్పులు చేసి తమ పిల్లలను ఆయా బడుల్లో చేరుస్తున్నారు. ఎంత ఫీజు ఉంటే అంత గొప్ప బడి అనే భావన కొందరిలో నెలకొంది. దీనిని పాఠశాల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్ అని బోర్డులు పెట్టి.. అద్దాల మేడలను తలపించే భవనాల్లో పాఠశాలలు నిర్వహిస్తూ రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాయి.